పంచాయతీ నిధులు పక్కదారి.. సర్పంచ్‌ చేతివాటం..

 Panchayat Funds Are Sideways .. - Sakshi

భుజబలపట్నంలో రూ.3 లక్షల నిధులు గోల్‌మాల్‌

మాజీ సర్పంచ్‌లు, అధికారులకు నోటీసులు 

సమాచార హక్కు చట్టంతో అవినీతి వెలుగులోకి 

రికవరీ చేస్తామన్నా అధికారులు 

సాక్షి, కైకలూరు: పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. అక్రమార్కులకు అధికారం అండదండలు ఉండటంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావటం లేదు. దీనికి తోడు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్షల నిధులు స్వాహ అవుతున్నాయి. 

జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ అవుతున్నాయి. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదును పంచాయతీకి జమ చేయకపోవడం, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి బిల్లులు పొందడం, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పేరుతో నగుదు కాజేయడం, జిల్లా అధికారుల ఖర్చుల పేరుతో నకిలీ బిల్లులతో నగదు పొందడం వంటి పలు  రూపాల్లో పంచాయతీ సొమ్మును కొందరు దిగమింగుతున్నారు.

పలువురు సర్పంచ్‌లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్పలంగా ఉండటంతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో అక్రమార్కుల పదవీ కాలం ముగిస్తోంది.

భుజబలపట్నం పంచాయతీలో నిధులు స్వాహా
కైకలూరు మండలంలో భుజబలపట్నం మేజర్‌ పంచాయతీలో ఒకటి. పంచాయతీల వనరుల రూపంలో ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. పంచాయతీలో జరిగే అవకతవకలపై గ్రామానికి చెందిన మంతెన రామ్మూర్తిరాజు పదేళ్ల కాలంలో జరిగిన నిధుల వినియోగంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు.

దీంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. పంచాయతీ నుంచి డీఎల్‌పీవో వాహనానికి రూ.17,000 చెల్లించినట్లు ఉంది. ఇవే కాకుండా పలు బిల్లుల్లో తేడాలు ఉన్నాయి. ఈ ఘటనపై మచిలీపట్నం డీఎల్‌పీవో విచారణ చేసి ఈ నెల 11న పంచాయతీ నిధులు రూ.1,63,516.. ఆర్థిక సంఘం నిధులు రూ.1,39,074 వెరసి రూ.3,02, 590 దుర్వునియోగం అయినట్లు గుర్తించారు. 

సర్పంచ్‌లకు నోటీసులు
భుజబలపట్నం పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మాజీ సర్పంచ్‌లకు, అధికారులకు పంచాయతీశాఖ జిల్లా అధికారులు నోటీసులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు రూ.1,51,295, మాజీ సర్పంచ్‌ సయ్యపురాజు గుర్రాజు రూ.23,039, మరో మాజీ సర్పంచ్‌ బి.రామలక్ష్మీ రూ.1,04,087, పూర్వ పంచాయతీ ప్రత్యేకాధికారి హెప్సిబారాణి రూ.24,169 నిధులను చెల్లించాలని నోటీ సులు పంపారు.

వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులు సదరు నగదును చెల్లించాలని నోటీసులో సూచించారు. ఇవే కాకుండా కైకలూరు నియోజకవర్గ పరిధిలో కైకలూరు, కలిదిండి, గుర్వాయిపాలెం, కోరుకొల్లు, వైవాక, దేవపూడి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణలు జరిగాయి.

సొమ్ము రికవరీ చేస్తాం
భుజబలపట్నం పంచాయతీలో రూ.3,02,590 నిధులు దుర్వినియోగం అయినట్లు మచిలీపట్నం డీఎల్‌పీవో విచారణలో తేలింది. అందుకు బాధ్యలైన అందరికి నోటీసులు అందించడం జరిగింది. సదరు వ్యక్తుల నుంచి నగదును రీకవరీ చేసుకుంటాం. పంచాయతీ రికార్డులు ఖచ్చితంగా పారదర్వకతతో నిర్వహించాలి. 
    – అరుణ్‌కుమార్, ఈవోపీఆర్‌డి, కైకలూరు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top