ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డికి సతీ వియోగం

Palle Raghunatha Reddy Wife Died With Illness In Puttaparthi Anantapur - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి సతీమణి, బాలాజీ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ పల్లె ఉమాదేవి(56) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో  చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో సాయంత్రం 3.46 గంటలకు తుదిశ్వాస విడిచారు. సామాన్య కుటుంబంలో జన్మించిన పల్లె ఉమాదేవి స్వగ్రామం శింగనమల మండలం సోదనపల్లి. పల్లె రఘునాథరెడ్డితో ఆమెకు 1979 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు వెంకటకృష్ణకిశోర్, కోడలు సింధూర, మనుమడు, మనుమరాలు ఉన్నారు. పల్లె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఉమాదేవి కీలక పాత్ర పోషించారు.

బాలాజీ విద్యాసంస్థల ద్వారా ఆమె పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో ఆమె పుట్టపర్తిలో జరిగిన  సమైక్యాంధ్ర ఉద్యమంలో పల్లె రఘునాథరెడ్డిని బలవంతంగా దీక్ష విరమింపజేయడంతో ఆమె దీక్ష  కొనసాగించింది. ఇటీవల ఆమె ఆరోగ్యం కుదుట పడాలని  యువజనోత్సవాల్లో క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు    ఆసుపత్రికి చేరుకుని ఉమాదేవి మృతదేహానికి నివాళులర్పించారు. మంత్రులు నారాలోకేష్, కాలవ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమె మృతదేహాన్ని సందర్శించారు. మరణవార్త తెలియడంతో పుట్టపర్తి, అనంతపురంలోని పల్లె ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. పుట్టపర్తి నుంచి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌ తరలివెళ్లారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top