లోక్ అదాలత్‌ల్లో 18,410 కేసుల పరిష్కారం

హైకోర్టులో 966 కేసుల పరిష్కారం
పెండింగ్ కేసుల విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీజే
గతానికి భిన్నంగా ముందస్తు బెంచ్‌లు ఏర్పాటు
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లు విజయవంతమయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 18,410 కేసులు ఒక్క రోజులో పరిష్కారమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి లోక్ అదాలత్‌లు ప్రారంభించారు. హైకోర్టులో 6 బెంచ్‌లు ఏర్పాటు చేయగా.. 13 జిల్లాల్లో 330 బెంచ్‌లు విచారణలో పాలు పంచుకున్నాయి. హైకోర్టులో సాయంత్రం 5 గంటల తరువాత కూడా అదాలత్‌లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 18,410 కేసులు పరిష్కారమయ్యాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో 638 కేసులు, మిగిలిన బెంచ్‌ల్లో మరో 328 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 963 ముందస్తు వివాదాల కేసులు కూడా పరిష్కరించారు. కేసుల పరిష్కారం ద్వారా రూ.38.23 కోట్ల పరిహారాన్ని సంబంధిత కక్షిదారులకు చెల్లిస్తారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ప్రధాన న్యాయమూర్తి
పెండింగ్ కేసులపై ప్రధానంగా దృష్టి సారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాల్లోని లోక్ అదాలత్‌లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. న్యాయాధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు శాఖల అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పోలీసులు,, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయవాదులతో ముందస్తు సమావేశాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెప్పించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు బెంచ్‌లు ఏర్పాటు చేశారు.
ఈ నెల 3 నుంచి సాయంత్రం కోర్టు పనివేళలు ముగిశాక లోక్ అదాలత్ కేసులు విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు కూడా రాత్రి 8 గంటల వరకు కేసులు విచారించారు. కొన్నిసార్లు కక్షిదారుల్ని కోర్టుకు పిలిపించి, వారి సమక్షంలోనే కేసులు పరిష్కరించి, అక్కడికక్కడే పరిహారం నిర్ణయించారు. ముందస్తు బెంచ్‌ల ద్వారా ఈ నెల 12 వరకు 849 కేసులను పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాకేష్ కుమార్‌ల సూచనలు, సలహాలతో లోక్ అదాలత్‌లు విజయవంతమయ్యాయని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి డాక్టర్ వీఆర్‌కే కృపాసాగర్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి