ఇది సేంద్రియ పాల కాలం!

ఇది సేంద్రియ పాల కాలం!


పాలు సంపూర్ణ ఆహారం అన్నది ఎంత నిజమో.. రసాయనిక అవశేషాలతో కూడిన పాలు అనారోగ్య హేతువన్నది కూడా అంతే నిజం! సేంద్రియ పాలపై మధ్యతరగతి వినియోగదారుల్లో అవగాహన క్రమంగా పెరుగుతున్నది. సేంద్రియ పాల ఉత్పత్తికి దేశీ జాతి పశువులతో పాటు, రసాయనిక అవశేషాల్లేని గడ్డి, దాణా దినుసులు అవసరం. దాణాలో బీటీ పత్తి చెక్కను వాడకూడదు. నిపుణులు సిఫారసు చేసిన ఔషధాలను మాత్రమే వాడాలి. నీడన కట్టేసి ఉండే పశువుల పాల కన్నా.. ఆరుబయట తిరిగే పశువుల పాలు ఇంకా శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పాల డెయిరీలు మన రాష్ట్రంలోనూ ప్రజాదరణ పొందుతున్నాయనడానికి ఈ యువరైతుల అనుభవాలే నిదర్శనం..

 

సేంద్రియ పాడి రైతుగామారిన యువ వైద్యుడు

ఆరోగ్యవంతమైన సేంద్రియ పాలను వినియోగదారులకు అందించే లక్ష్యంతో డా. గద్దె సుదర్శనరావు అత్యాధునిక రీతిలో డెయిరీ ఫాంను నెలకొల్పారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలకు చెందిన సుదర్శనరావు హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. రసాయనిక అవశేషాలు లేని, ఔషధ గుణాలు కలిగిన పాలను ఉత్పిత్తి చేసి ప్రజలకు అందిస్తే వారికి మంచి ఆరోగ్యాన్నిచ్చినట్టేనని భావించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో అత్యాధునిక పద్ధతుల్లో డెయిరీని ఏర్పాటు చేశారు. విశ్రాంత వైద్యుడైన తన తండ్రి డా. జీవీ కృష్ణారావు తోడ్పాటుతో డెయిరీని నిర్వహిస్తున్నారు. ఔషధ విలువలతోపాటు పాలధార ఎక్కువగా ఉండే 40 దేశవాళీ గిర్ జాతి ఆవులతోపాటు 20 జాఫరాబాదే రకం గేదెలతో గత ఏడాది నవంబర్ 1న డెయిరీ ఫాంను ప్రారంభించారు. గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతానికి చెందిన గిర్ ఆవులను కొనుగోలు చేశారు. రోజుకు ఒక్కో ఆవు 20 లీటర్లు, ఒక్కో గేదె 16 లీటర్లు వరకు పాల దిగుబడి ఇస్తున్నాయి. పాలను ప్యాకెట్లలో నింపి హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు.



ఆధునిక పద్ధతిలో గోధుమ గడ్డి సాగు!

సేంద్రియ విధానంలో ఆధునిక హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చి మేతను సాగు చేస్తుండడం విశేషం. రూ.35 లక్షల వ్యయంతో హైడ్రోపోనిక్ ఫాడర్ మిషన్‌ను నెలకొల్పారు. శీతలీకరణ గిడ్డంగి మాదిరిగా ఉండే ప్రత్యేకంగా రూపొందించిన ఈ పశుగ్రాస యంత్రం ద్వారానే బార్లీ, గోధుమ, అలసంద, మొక్కజొన్న తదితర విత్తనాలతో పచ్చి మేతను పెంచుతున్నారు. ట్రేలలో ఈ గింజలను పోసి.. ఆరు రోజులపాటు 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి, 20 నిమిషాలకోసారి నీటి తుంపరలు పడేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యుత్/ జనరేటర్‌తో నడుస్తున్న ఈ యంత్రాన్ని గోబర్ గ్యాస్‌తో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొలకెత్తిన గింజలు ఏడో రోజుకు సుమారు 5 అంగుళాల ఎత్తు పెరుగుతాయి. రసాయనాలు వాడకుండా పెంచిన ఈ గడ్డిని ఆవులకు మేపుతున్నారు. ఒక కిలో విత్తనాలతో పది కిలోల పశుగ్రాసం లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గడ్డితోపాటు ఆవులు, గేదెలకు దాణా కూడా పెడుతున్నారు. పచ్చి మేత పెంపకంతోపాటు పాలు పితకడం.. పితికిన పాలను శీతలీకరించడం.. ప్రత్యేకంగా సంచుల్లో నింపడం.. అంతా యంత్రాలతోనే చేస్తుండడం విశేషం. సుధాకరరావు ఆరోగ్యదాయకమైన పాలను ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.

 - ఐ.ఉమామహేశ్వరరావు సాక్షి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా

 (ఇన్‌పుట్స్: పామర్తి నాగేంద్రరావు,న్యూస్‌లైన్, పమిడిముక్కల)

 

స్వచ్ఛమైన పాల ఉత్పత్తిలో యువ రైతు

మెదక్ జిల్లాలో ఓ యువరైతు సహజమైన పద్ధతుల్లో దేశవాళీ ఆవుల డెయిరీ నిర్వహిస్తూ స్వచ్ఛమైన పాల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఒమర్ (27) పదో తరగతి వరకు చదువుకొని కొన్ని సంవత్సరాలు చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. సంతృప్తి చెందక వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. జగదేవ్‌పూర్ మండలం గణేష్‌పల్లిలో మూడేళ్ల క్రితం ఏడెకరాల భూమిని కొనుగోలు చేసి రెండు బోర్లు వేశాడు. తొలి ఏడాది మొక్కజొన్న సాగు చేశాడు. ఆ తర్వాత అతని మనసు పాడి పరిశ్రమ వైపు మళ్లింది. ఏదైనా ప్రత్యేకత ఉంటే మార్కెటింగ్ సులువు అవుతుందన్న భావనతో నాటు ఆవులతో డెయిరీని నిర్వహించడం మేలనుకున్నాడు. గుజరాత్ వెళ్లి అధి కంగా పాలిచ్చే 17 నాటు ఆవులను కొనుగోలు చేశాడు. నిపుణుల సలహా మేరకు.. ఆవులను స్వేచ్చగా ఆరుబయట తిరిగి మేత మేసే విధంగా తన వ్యవ సాయ క్షేత్రానికి చుట్టూ ఫెన్సింగ్ వేయించాడు. పొ లంలో రసాయనిక ఎరువులు వినియోగించకుండా జీవామృతంతో పశుగ్రాసం సాగు చేసి ఆవులకు మేపుతూ మంచి ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం 9 ఆవులు ఒక్కొక్కటి రోజుకు 10 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ఈ ఉత్సాహంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగు కూడా చేపట్టడానికి ఒమర్ సంసిద్ధమవుతున్నాడు.     

 - వై.సురేందర్, న్యూస్‌లైన్, గజ్వేల్, మెదక్ జిల్లా

 

మొదట్లో ఎవరూ ఆదరించలేదు!

స్వచ్ఛమైన పాలను తొలుత తా ను ఊరురా తిరిగి అమ్మే వాడిని. అయితే అవగాహనలేక ప్రజలు కొనడానికి ఆసక్తి చూపలేదు. హైద్రాబాద్ లోని ప్రముఖ మిఠాయి వ్యాపారవేత్త ఇటీవలే నా గురించి తెలుసుకొని పాలను కొనుక్కెళ్తున్నారు. ఏపూటకాపూట తాజాగా వినియో గదారులకు అందిస్తున్నారు. సంకర జాతి ఆవు పాలకన్నా ఈ పాలకు రెట్టింపు ధర పలుకుతుండడంతో మంచి ఆదాయం పొందగలుగుతున్నా. రసాయనాల అవశేషాలు లేని, ఔషధ విలువలు కలిగిన ఈ పాలు చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందిస్తాయని వినియోగదారులు అర్ధం చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన పాలకు డిమాండ్ ఇంకా పెరుగుతుంది.

 - ఒమర్ (99085 71176), దేశీ ఆవు పాల రైతు,

 గణేష్‌పల్లి, జగదేవ్‌పూర్ మండలం, మెదక్ జిల్లా

 

సహజమైన పాలు అందించడమే లక్ష్యం!

సహజసిద్ధమైన ఆవు పాలను అందించే లక్ష్యంతో రసాయనాలు వాడని మేతను ఆవులకు మేపుతున్నాం. ఆయుర్వేద ఔషధాలను వాడాలనుకుంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తిపై ఆసక్తితో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి డెయిరీలను పరిశీలించి ఆధునిక పద్ధతిలో ఈ డెయిరీని ఏర్పాటు చేశా. యంత్రాల వాడకం ద్వారా కూలీల కొరతను అధిగమించాం. మా డెయిరీలో ముగ్గురు కార్మికులు, ఒక సూపర్‌వైజర్ పనిచేస్తారు. మా నాన్న డా. జీవీ కృష్ణారావు (99590 90105, 99632 00729) పర్యవేక్షిస్తున్నారు. డెయిరీ ఫాంకు అనుసంధానంగా గోబర్ గ్యాస్ ప్లాంట్, సోలార్ సిస్టంను పెట్టుకుంటే కరెంటు ఖర్చు తగ్గుతుందనుకుంటున్నాం.

 - డా. గద్దె సుదర్శనరావు, సేంద్రియ డెయిరీ యజమాని,

 వీరంకిలాకు, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా

 

నాటు పశు జాతుల ప్రత్యేకతేమిటి?

ఎ2 బీటా కెసిన్ అనే ప్రొటీన్ పుష్కలంగా ఉండే సేంద్రియ పాలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ పాలకు మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతోంది. మోపురం ఉండే దేశీ/నాటు జాతుల ఆవులు, బర్రెల పాలల్లో ఎ2 కెసిన్ 94 నుంచి 100% వరకు ఉందని హర్యానాలోని భారతీయ జంతు జన్యు వనరుల సంస్థ(ఎన్ బీఏజీఆర్) అధ్యయనంలో తేలింది. గిర్ తదితర జాతుల ఆవు పాలలో ఎ2 కెసిన్ 100% ఉండగా, ఒంగోలు ఆవు తదితర దేశీ పశుజాతుల పాలలో 94 శాతం ఉందని వెల్లడైంది.

 

దేశీ ఆవు పెరుగుతో మధుమేహానికి చెక్!

దేశీ లేదా నాటు ఆవు పెరుగుతో మధుమేహం తగ్గించవచ్చని హైదరాబాద్(ఇక్రిశాట్ ఆవరణ)లోని అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. సాయిబుచ్చారావు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా ఆయన ఒంగోలు, గిర్ ఆవులకు మూలికలతో ప్రత్యేకంగా రూపొందించిన దాణా పెట్టి.. ఈ ఆవుల పాలతో తయారైన పెరుగును స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ముగ్గురు మధుమేహ రోగులకు తినిపించారు. ఈ అధ్యయనం ప్రాథమిక దశ విజయవంతంగా పూర్తయిందని డా. సాయిబుచ్చారావు తెలిపారు. తదుపరి దశ అధ్యయనం కొనసాగుతోందన్నారు. దీని ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిస్తామని ఆయన వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top