రొయ్యలకు ప్రత్యామ్నాయం  ‘పాంపనో’! | Sagu Badi: Sakshi Special Story about Pompano fish | Sakshi
Sakshi News home page

రొయ్యలకు ప్రత్యామ్నాయం  ‘పాంపనో’!

Jul 15 2025 6:02 AM | Updated on Jul 15 2025 6:02 AM

Sagu Badi: Sakshi Special Story about Pompano fish

పంట మార్పిడి చెయ్యటం అనేది పంట పొలాల్లో మాదిరిగానే ఆక్వా సాగులోనూ అత్యవసరమైన విషయమే. తీరప్రాంతాల్లోని ఉప్పునీటి చెరువుల్లో వనామీ తదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయటానికి అవకాశాలు చాలా తక్కువ. సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్‌ అంటారు. ఈ దిశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశో«ధనా సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్‌ఎఫ్‌డీబీ) వంటి సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీరప్రాంత చెరువుల్లో సాగులోకి వచ్చాయి. ఈ కోవలో మొదటిది సీబాస్‌ (పండుగప్ప)కు తాజాగా సముద్ర చేప పాంపనో (చందువా పార)తోడైంది.

‘చందువా జాతికి చెందినదే పాంపనో కూడా. ఒకే ముల్లు ఉంటుంది. అయితే, పాంపనో చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది. అంతే తేడా’ అని సీఎంఎఫ్‌ఆర్‌ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ మెగారాజన్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2016లో పాంపనో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించటంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 
ఆ నేపథ్యంలోనే పాంపనో సాగును కృష్ణా తదితర జిల్లాల్లో అనేక చోట్ల 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) తోడ్పాటుతో ప్రోత్సహించామని, వందెకరాల్లో సాగవుతోందన్నారు. పాంపనో చేపల రుచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు. తద్వారా పాంపనో చేపలకు మంచి మార్కెట్‌ ఉందని డా. మెగారాజన్‌ అన్నారు. సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవటంతో పాంపనో చేపలను చెరువుల్లో పెంచటం ద్వారా ఆక్వా రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. 

పాంపనో సీడ్‌ ఉత్పత్తి సాంకేతికతను ఆర్నెల్ల క్రితమే ఒక ప్రైవేటు హేచరీకి సీఎంఎఫ్‌ఆర్‌ఐ బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హేచరీ ఇప్పటికే పాంపనో సీడ్‌ ఉత్పత్తి ప్రారంభించింది. ఉప్పునీటి రొయ్యల చెరువుల్లో వైట్‌స్పాట్‌ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. అందుకు అన్ని విధాలా అనువైనది పాంపనో చేప. ఇప్పుడు సీడ్‌ అందుబాటులోకి రావటంతో పాంపనో సాగు విస్తరించే అవకాశం ఉందని అన్నారాయన.

మూల పొలంలో పాంపనో సాగు!
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు  (ఎన్‌ఎఫ్‌డీబీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపనో (చందువా పార), సీబాస్‌ (పండుగప్ప) సాగును ప్రారంభించారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి 2008లో 97.45 ఎకరాల భూమిని ఎన్‌ఎఫ్‌డీబీకి ప్రభుత్వం కేటాయించింది. 

రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలి దశకు అడుగు ముందుకు పడింది. నర్సరీ చెరువులు, కల్చరల్‌ చెరువులు, సముద్రపు నీటిని తీసుకురావడం, బయటకు పంపించడం, వడపోత వ్యవస్థలు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. 

ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక చెరువులో తొలిసారి 2024 జూలైలో పాంపనో (చందువా పార) సాగు టెక్నికల్‌ కన్సల్టెంట్‌ ఆంజనేయులు ప్రారంభించారు. చేప పిల్లలను సీఎఫ్‌టీఆర్‌ఐ ద్వారా తెచ్చి, రెండు నెలలు సీడ్‌ ట్యాంకుల్లో పెంచి, తర్వాత పెంపకపు చెరువులోకి మార్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అ«ధికారులు, శాస్త్రవేత్తల సలహాతో 25 సెంట్ల చెరువులో  3 వేల పిల్లలను విడిచి పెట్టారు. 8 నెలలు పెంచిన తరువాత గత నెల 29న 900 కిలోల పాంపనో చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు. ఇంకో 900 కిలోల చేపలు ఉన్నాయి. 

అధిక విస్తీర్ణంలో సాగు చేయటం లాభదాయకమేనన్నారు. పాంపనో సాగులో నష్టం వచ్చే అవకాశాలు తక్కువన్నారు. చెరువు నీటిలో పాంపనో సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఆంజనేయులును అభినందించారు. ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శ కత్వంలో టెక్నికల్‌ కన్సల్టెంట్‌ కె. ఆంజనేయులు పాంపనో మొదటి చేపల సాగు జయప్రదమైంది. దీంతో ఈ  ప్రాంత ఆక్వా రైతుల్లో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి.
 

పాంపనో సాగులో రిస్క్‌ తక్కువ! 
ఇండియన్‌ పాంపనో (చందువా పార) నీటిలో ఉప్పదనం 5 నుంచి 40 పిపిటి వరకు తట్టుకొని పెరుగు తుంది. ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు. పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి. అయితే, పాంపనోతో ఆ సమస్య లేదు. రొయ్య­లకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధు­లు ముసురుకోవు. వ్యాధుల రిస్క్‌ తక్కువ. 10 గ్రా./2 అంగుళాల పిల్లలను చెరువులో వేసు­కుంటే.. 5–6 నెలల్లో 500–600 గ్రా. బరువు పెరుగుతాయి. పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి. రైతుకు కిలో రూ. 350–450 ధర వస్తుంది. రైతులకు మంచి నికరాదాయం వస్తుంది. పాంపనో సాగు 3 కోస్తా జిల్లాల్లో మొదలైంది. వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. 
– డా. మెగారాజన్‌ (95057 68370) సీనియర్‌ శాస్త్రవేత్త, 
ఈఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం

2 కిలోల మేతకు కిలో చేప
సముద్రపు జాతుల చేపలను ఉప్పునీటి చెరువుల్లో పెంచ డాని (మారికల్చర్‌)కి అనుభవంతో పాటు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించటం అవసరం. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న భూమిలో పనులు మొదలుపెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది. 25 సెంట్ల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపనో పిల్లలు వేస్తారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తల సలహాతో అధిక సాంద్రతలో 3 వేల పిల్లలను పెంచాం. కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరమైంది. పిల్లలన్నీ చక్కగా పెరగటం సంతృప్తినిచ్చింది. మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నాం. మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తాం. 
– కె.ఆంజనేయులు, టెక్నికల్‌ కన్సల్టెంట్, ఎన్‌ఎఫ్‌డీబీ ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ ఫెసిలిటీ, మూలపొలం, శ్రీకాకుళం జిల్లా  

– పిరియ ధర్మేంద్ర, సాక్షి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement