breaking news
Crop rotation policy
-
రొయ్యలకు ప్రత్యామ్నాయం ‘పాంపనో’!
పంట మార్పిడి చెయ్యటం అనేది పంట పొలాల్లో మాదిరిగానే ఆక్వా సాగులోనూ అత్యవసరమైన విషయమే. తీరప్రాంతాల్లోని ఉప్పునీటి చెరువుల్లో వనామీ తదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయటానికి అవకాశాలు చాలా తక్కువ. సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్ అంటారు. ఈ దిశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశో«ధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ) వంటి సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీరప్రాంత చెరువుల్లో సాగులోకి వచ్చాయి. ఈ కోవలో మొదటిది సీబాస్ (పండుగప్ప)కు తాజాగా సముద్ర చేప పాంపనో (చందువా పార)తోడైంది.‘చందువా జాతికి చెందినదే పాంపనో కూడా. ఒకే ముల్లు ఉంటుంది. అయితే, పాంపనో చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది. అంతే తేడా’ అని సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మెగారాజన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2016లో పాంపనో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించటంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే పాంపనో సాగును కృష్ణా తదితర జిల్లాల్లో అనేక చోట్ల 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) తోడ్పాటుతో ప్రోత్సహించామని, వందెకరాల్లో సాగవుతోందన్నారు. పాంపనో చేపల రుచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు. తద్వారా పాంపనో చేపలకు మంచి మార్కెట్ ఉందని డా. మెగారాజన్ అన్నారు. సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవటంతో పాంపనో చేపలను చెరువుల్లో పెంచటం ద్వారా ఆక్వా రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. పాంపనో సీడ్ ఉత్పత్తి సాంకేతికతను ఆర్నెల్ల క్రితమే ఒక ప్రైవేటు హేచరీకి సీఎంఎఫ్ఆర్ఐ బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హేచరీ ఇప్పటికే పాంపనో సీడ్ ఉత్పత్తి ప్రారంభించింది. ఉప్పునీటి రొయ్యల చెరువుల్లో వైట్స్పాట్ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. అందుకు అన్ని విధాలా అనువైనది పాంపనో చేప. ఇప్పుడు సీడ్ అందుబాటులోకి రావటంతో పాంపనో సాగు విస్తరించే అవకాశం ఉందని అన్నారాయన.మూల పొలంలో పాంపనో సాగు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపనో (చందువా పార), సీబాస్ (పండుగప్ప) సాగును ప్రారంభించారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి 2008లో 97.45 ఎకరాల భూమిని ఎన్ఎఫ్డీబీకి ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలి దశకు అడుగు ముందుకు పడింది. నర్సరీ చెరువులు, కల్చరల్ చెరువులు, సముద్రపు నీటిని తీసుకురావడం, బయటకు పంపించడం, వడపోత వ్యవస్థలు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక చెరువులో తొలిసారి 2024 జూలైలో పాంపనో (చందువా పార) సాగు టెక్నికల్ కన్సల్టెంట్ ఆంజనేయులు ప్రారంభించారు. చేప పిల్లలను సీఎఫ్టీఆర్ఐ ద్వారా తెచ్చి, రెండు నెలలు సీడ్ ట్యాంకుల్లో పెంచి, తర్వాత పెంపకపు చెరువులోకి మార్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అ«ధికారులు, శాస్త్రవేత్తల సలహాతో 25 సెంట్ల చెరువులో 3 వేల పిల్లలను విడిచి పెట్టారు. 8 నెలలు పెంచిన తరువాత గత నెల 29న 900 కిలోల పాంపనో చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు. ఇంకో 900 కిలోల చేపలు ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేయటం లాభదాయకమేనన్నారు. పాంపనో సాగులో నష్టం వచ్చే అవకాశాలు తక్కువన్నారు. చెరువు నీటిలో పాంపనో సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఆంజనేయులును అభినందించారు. ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శ కత్వంలో టెక్నికల్ కన్సల్టెంట్ కె. ఆంజనేయులు పాంపనో మొదటి చేపల సాగు జయప్రదమైంది. దీంతో ఈ ప్రాంత ఆక్వా రైతుల్లో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పాంపనో సాగులో రిస్క్ తక్కువ! ఇండియన్ పాంపనో (చందువా పార) నీటిలో ఉప్పదనం 5 నుంచి 40 పిపిటి వరకు తట్టుకొని పెరుగు తుంది. ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు. పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి. అయితే, పాంపనోతో ఆ సమస్య లేదు. రొయ్యలకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధులు ముసురుకోవు. వ్యాధుల రిస్క్ తక్కువ. 10 గ్రా./2 అంగుళాల పిల్లలను చెరువులో వేసుకుంటే.. 5–6 నెలల్లో 500–600 గ్రా. బరువు పెరుగుతాయి. పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి. రైతుకు కిలో రూ. 350–450 ధర వస్తుంది. రైతులకు మంచి నికరాదాయం వస్తుంది. పాంపనో సాగు 3 కోస్తా జిల్లాల్లో మొదలైంది. వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. – డా. మెగారాజన్ (95057 68370) సీనియర్ శాస్త్రవేత్త, ఈఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం2 కిలోల మేతకు కిలో చేపసముద్రపు జాతుల చేపలను ఉప్పునీటి చెరువుల్లో పెంచ డాని (మారికల్చర్)కి అనుభవంతో పాటు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించటం అవసరం. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న భూమిలో పనులు మొదలుపెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది. 25 సెంట్ల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపనో పిల్లలు వేస్తారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తల సలహాతో అధిక సాంద్రతలో 3 వేల పిల్లలను పెంచాం. కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరమైంది. పిల్లలన్నీ చక్కగా పెరగటం సంతృప్తినిచ్చింది. మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నాం. మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తాం. – కె.ఆంజనేయులు, టెక్నికల్ కన్సల్టెంట్, ఎన్ఎఫ్డీబీ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీ, మూలపొలం, శ్రీకాకుళం జిల్లా – పిరియ ధర్మేంద్ర, సాక్షి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా -
బ్రాండ్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : ‘ఏ రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్ చేస్తే ధర పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతీది కల్తీ అవుతోంది. మార్కెట్లో ఒక బ్రాండ్ పేరుతో మన ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను విక్రయించాలి. ప్రభుత్వ పరంగా తయారైన వస్తువులని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. మన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రారంభించాలి. మన ఆలోచనలకు కార్యరూపమిచ్చి అమలు చేయాలి. ఏ ప్రాంతంలో ఎన్ని, ఏ రకమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలో నిర్ణయించాలి. మన రాష్ట్ర అవసరాలకు సరిపోగా.. మిగిలిన ఉత్పత్తులను పక్క రాష్ట్రాల్లో, విదేశాలకు ఎగుమతి చేయాలి. ఈ ప్రక్రియలో ఐకేపీ–మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు అధ్యయనం చేయాలి. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్. ఏ రాష్ట్రంలో ఏ పంట పండదో విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ వాటిని పండించి, వాటితో ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను తయారు చేయాలి. దేశ, విదేశాల్లో అత్యుత్తమ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునే అంశంపై అధ్యయనం చేయాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధిపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బృందాలతో పాటు పలువురిని భాగస్వాములను చేయాలన్నారు. తొలుత ఆరేడు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈ కార్యక్రమం ప్రారంభించాలన్నారు. తర్వాత భారీ స్థాయిలో విస్తరించవచ్చన్నారు. అధికారులు వివిధ స్థాయిల్లో మేధోమథన కార్యక్రమాలను, వర్క్ షాపులను నిర్వహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. 4 లక్షలకు పైగా ఉన్న ఐకేపీ మహిళా సంఘాల్లో ఉన్న 45 లక్షల మంది సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విత్తన కంపెనీల నియంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు అందుబాటులో ఉంచాలన్నారు. నాటు యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు. పంట మార్పిడిపై అవగాహన రావాలి.. ‘రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలియాలి. మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణంగా పరిశోధనలు జరగాలి. అంతర్జాతీయ విపణిలో మన దేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో ఉండటం దురదృష్టకరం. దీన్ని అధిగమించాలి. ప్రతి గ్రామం అక్కడి ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలి. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు సరఫరా చేయాలి’అని సీఎం అన్నారు. ‘రైతులందరూ ఒకే రకమైన పంటలేస్తే సమస్యలొస్తాయి. వారికి పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్ధ అలవాట్లలో కొంత వరకు మార్పు రావాలి. ముల్కనూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్ధతిలో రైతులను సంఘటిత పరచడంతో గొప్ప ఫలితాలొచ్చాయి. ఇలా చేస్తే లాభం కలుగుతుందని అధికారులు నమ్మకం కలిగిస్తే బ్రహ్మాండమైన ఫలితాలొస్తాయి. రాష్ట్రంలో ఈ అంశాలపై వర్క్షాప్ నిర్వహించాలని ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాటిని ఆహ్వానించాను. త్వరలో ఆయన రాష్ట్రానికి వస్తారు’అని కేసీఆర్ తెలిపారు. పంట కాలనీలుగా విభజించాలి... ‘రాష్ట్రాన్ని పంట కాలనీలుగా విభజించాలి. రైతు పండించే పంటకు డిమాండ్ ఉండాలి. రాష్ట్ర ఆహార అవసరాలను తెసుకొని, ఆ మేరకు పంటలు వేసే దిశగా రైతుల్లో అవగాహన పెంచాలి. రైతులపై ఒకేసారి అభిప్రాయాలను రుద్దకుండా క్రమపద్ధతిలో జరగాలి. గ్రామీణ, పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తులుండాలి. కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర వంటి వాటిని దిగుమతి చేసుకోవడం దురదృష్టకరం. నగరాల, పట్టణాల సమీపంలో కూరగాయల ఉత్పత్తి జరగాలి. వచ్చే వానాకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. వచ్చే రెండేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తై కోటి ఎకరాలకుపైగా సాగు నీరందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటలకు సంబంధించి చాలా విషయాల్లో కచ్చితమైన గణాంకాలు లేక సరైన నిర్ణయానికి రావడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, గత నాలుగేళ్లలో సగటున 17.17 శాతం వృద్ధిరేటును సాధించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వృద్ధిరేటు వుందని, స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్నీ విధాలుగా రాష్ట్రాభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. మూస పద్ధతిలో ఆలోచించకుండా కొత్త ఒరవడికి సిద్ధం కావాలన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
పంటమార్పిడితో ప్రయోజనం
నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు. అవగాహన అవసరం పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. రైతులు గమనించాల్సినవి భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి. దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు. పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి. సూచనలు జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు. దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి.