ఆపరేషన్‌ ఆర్కే వెంటనే నిలిపేయాలి

Operation RK In Visakhapatnam District - Sakshi

వైఎస్‌ జగన్‌ సర్కారుపై మాకు నమ్మకం ఉంది

అరుణను కోర్టులో హాజరుపరచాలి

ప్రజా సంఘాల డిమాండ్‌

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణం): ఏవోబీలో ఆపరేషన్‌ ఆర్కే వెంటనే నిలిపివేసి, ఆ పేరిట ఆదివాసులపై జరుగుతున్న హింసను ఆపేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలీసుల అదుపులో ఉన్న అరుణను కోర్టులో హాజరుపరచాలని కోరాయి. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, సంఘం ప్రతినిధి శిరీష(ఆర్కే భార్య), పౌర హక్కుల సంఘం నేత టి.శ్రీరామ్మూర్తి, ప్రగతి శీలా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి, సీఆర్‌పీపీ పద్మ, అరుణ తండ్రి లక్ష్మణరావు మాట్లాడారు.

ఈ నెల 22 మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, అందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని వార్త వచ్చిందని, ఆ తర్వాత ఐదుగురు కాదు ముగ్గురని పోలీసులు ప్రకటించారన్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత అరుణ ఉన్నారని ప్రకటించారని, మళ్లీ ఆమె ఉందో లేదో చెప్పకుండా ఉంచారని పేర్కొన్నారు. ఏవోబీలో కూంబింగ్‌ చేసినప్పుడల్లా సాధారణ ఆదివాసులను మావోయిస్టుల పేరిట చంపి ఎన్‌కౌంటర్‌ ప్రకటించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. అరుణ గనుక పోలీసుల అదుపులో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని కోరారు.

ఈ నెల 13న ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ కటాప్‌ ఏరియాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సంతకు వెళ్లిన అర్జున్‌ కిలో అనే ఆదివాసి యువకుడిని విచారణ పేరిట తీసుకెళ్లి 3 రోజులకు చంపేశారని దుయ్యబట్టారు. మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన హిందుత్వ విధానాలు, కార్పొరేట్‌ ప్రయోజనాలను కాపాడే క్రమంలో తనకు అడ్డువస్తున్న అన్ని ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులను అణచివేస్తున్నారని ఆరోపించారు.  మొదట మిషన్‌ 2016–17 వ్యూహాలు విఫలమయ్యాక, భారత ప్రభుత్వం సమధాన్‌ 2022ను తెరపైకి తెచ్చిందన్నారు. అవసరమైతే విప్లవోద్యమ ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తామని కూడా ప్రకటించారన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దులోనే ఉన్నాడని, ఆర్కేను ఎలాగైనా పట్టుకోవాలని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ చెప్పారన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top