మృత్యువును జయించిన కమాండర్‌

operation rekaman Navy Officer In Visakhapatnam - Sakshi

సముద్రంలో చిక్కుకొని అస్వస్థతకు గురైన టామీ 

ఆపరేషన్‌ రక్షమ్‌ పేరుతో సహాయక చర్యలు

ఆరోగ్యంగా నగరానికి చేరిన నౌకాదళ అధికారి 

విశాఖ సిటీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లో బ్‌ రేస్‌–2018లో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడిన భారత నౌకా దళానికి చెందిన కమాండర్‌ అభిలాష్‌ టామీ ఎట్టకేలకు విశాఖ నగరానికి చేరుకున్నారు. ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏౖకైక అధికారి అభిలాష్‌ ఈ రేస్‌లో తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సెప్టెంబర్‌ 21న సాట్‌ఫోన్‌ ద్వారా సమాచారంఅందించారు. ఫ్రాన్స్‌లోని లెస్‌ సెబ్లెస్‌ పోర్టులో జూలై ఒకటో తేదీన ప్రారంభమైన గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌ 2019 ఏప్రిల్‌లో ముగియనుంది.

 ఒంటిచేత్తో నాన్‌ స్టాప్‌గా ప్రపంచయానం చెయ్యడమే ఈ రేస్‌ ప్రత్యేకత. భారత నౌకాదళానికి చెం దిన కమాండర్‌ అభిలాష్‌ సెయిలింగ్‌లో అందె వేసిన చెయ్యి. 2012–13లో ఐఎన్‌ఎస్‌వీ మహదేయ్‌లో ఒంటరిగా ప్రపంచ వ్యాప్తంగా 53వేల నా టికల్‌ మైళ్లు ప్రయాణిం చారు. కీర్తి చ క్ర, మాక్‌ గ్రె గోర్, టెన్జింగ్‌ నార్గే సహా పలు పురస్కారాలు సొం తం చేసుకున్నారు. ఈ ఫీట్‌ సాధించిన నేపథ్యం లో గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌కు ఎంపికయ్యారు. ఈ రేస్‌లో మేకిన్‌ ఇండియా నినాదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా గోవాలోని అక్వేరియస్‌ షిప్‌యార్డులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్‌వీ దురియా నౌకను వినియోగిస్తున్నారు.

 దక్షిణ హిందూ మహా సముద్రంలో పెర్త్‌కు 1500 నాటికల్‌ మైళ్ల దూరంలో, ఆస్ట్రేలియాకు 2,700 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు టామీ సందేశం అందించారు. తాను సొంతంగా కదలలేకపోతున్నాననీ, త్వరగా స్ట్రెచర్‌ పంపించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత టామీ నుంచి సమాచారం రాకపోవడంతో భారత నౌకాదళ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫిషరీస్‌ నౌక వీరి గమనాన్ని కనుగొని నేవీకి సమాచారం అందించింది.

 సమాచారం అందుకున్న రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ షిప్‌ దురియా వద్దకు బయలుదేరింది. మరోవైపు భారత నౌకాదళం కూడా రెస్క్యూ బృందాన్ని పంపించింది. ఐఎన్‌ఎస్‌ సాత్పురాతో పాటు ఓ ఛేతక్‌ హెలికాఫ్టర్‌ను రెస్క్యూ కోసం పంపించి ఆపరేషన్‌ రక్షమ్‌ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. చివరకు టామీ బయలుదేరిన దురియా ఓడను సెప్టెంబర్‌ 28న కనుగొని నౌకాదళాధికారిని రక్షించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ఐఎన్‌ఎస్‌ సాత్పురాలోనే శనివారం నగరానికి చేరుకున్నారు. టామీని కలిసిన తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top