దీపావళీ పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది.
విజయనగరం: దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణిచగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు చిన్నవీధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.