పై-లీన్ తుపాను తీరాన్ని దాటడంతో జిల్లా వాసులతోపాటు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల తొమ్మిదిన బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల...
= తీరం దాటిన తుపాను
= ఊపిరి పీల్చుకున్న జిల్లావాసులు
= సురక్షితంగా ఒడ్డుకు చేరిన 70 మంది మత్స్యకారులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను తీరాన్ని దాటడంతో జిల్లా వాసులతోపాటు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల తొమ్మిదిన బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల వద్ద ఏర్పడిన ఈ తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చేసిన సూచనలతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోయారు. తుపాను ప్రభావంతో ఈ నెల తొమ్మిదిన జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఇద్దరు బాలికలు, ఒక మహిళ వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందారు.
తుపాను ఒరిస్సా వైపు మళ్లటంతో భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతింటాయని రైతులు భయపడ్డారు. పై-లీన్ తీవ్రతకు జిల్లాలో ఒకటి, రెండు రోజులు మినహా పంటలకు నష్టం కలిగేలా వర్షాలు పడకపోవటం, తుపాను తీరం దాటినా జిల్లాపై ఎలాంటి ప్రభావమూ చూపకపోవడంతో గండం గడిచిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన చినగొల్లపాలెం, ఏటిమొండి పల్లెపాలెం మత్స్యకారులు 70 మంది శనివారం ఉదయం క్షేమంగా గ్రామానికి చేరుకున్నారు.
40 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం
తుపాను ప్రభావంతో శనివారం మంగినపూడిబీచ్‌లో సముద్రం 40 అడుగులు ముందుకు వచ్చింది. ఏడు అడుగుల కన్నా పై ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. తీవ్రత పెరగటంతో బందరు పోర్టులో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను పరిస్థితులను పరిశీలించేందుకు గాను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి అధికారులతో కలిసి మంగినపూడి బీచ్‌ను సందర్శించారు.
ముందుజాగ్రత్త చర్యలపై మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈవో సీహెచ్ కళావతి, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులతో సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ప్రత్యేకాధికారులతో పాటు గ్రామస్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో 200కు పైగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.