‘బీపీఎస్‌’పై అధికారుల నిర్లక్ష్యం

Officers Negligency On BPS Scheme In Vijayawada - Sakshi

పట్టణంలో ఓ చిరుద్యోగి తన తండ్రి నుంచి వచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ప్లాన్‌కు విరుద్ధంగా కొంత నిర్మాణం జరిగింది. బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌)లో రెగ్యులరైజ్‌ చేయించుకునేందుకు ఓ సారి దరఖాస్తు చేశాడు. అయితే ఆ దరఖాస్తును పక్కన పెట్టేశారు. మళ్లీ రెండోసారి దరఖాస్తు చేశారు. అయినా పట్టించుకోలేదు. చివరకు ఓ మాజీ ప్రజాప్రతినిధి ద్వారా బేరసారాలకు దిగాడు. చేద్దాం.. చూద్దాం అంటూ బదులిస్తున్నారు. ఈ సమస్య.. ఈ ఒక్క చిరుద్యోగిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా ఇదే పరిస్థితి. జిల్లాలో అందిన దరఖాస్తుల్లో 12 శాతానికి మించి పరిష్కారానికి నోచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం.    

సాక్షి, మచిలీపట్నం : బీపీఎస్‌ పథకం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదాయం సమకూర్చే ఓ సాధనం. అయితే ఈ పథకంపై జిల్లాలో ఆయా సంస్థల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా అందుతున్నా.. పరిష్కారమవుతున్న సమస్యలు బహుస్వల్పంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు విడుదలయ్యే గ్రాంట్స్‌లో కేంద్రం ఏటా వివిధ కారణాలు చూపి కోతలు విధిస్తోంది. ఈ తరుణంలో ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఉద్దేశించిన బీపీఎస్‌ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత సాకుతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం బీపీఎస్‌ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుండడంతో ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీపీఎస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక సంస్థలు మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. అయినా సరే తమకేమి పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. చివరకు కమిషనర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం కమిషనర్‌ సంతకం కోసం జిల్లా వ్యాప్తంగా 600కు పైగా దరఖాస్తులు ఎదురు చూస్తుండడం ఇందుకు నిదర్శనం.  

కొన్ని చోట్ల ఒక్కో పనికి ఒక్కో రేటు 
బిల్డింగ్‌ పీనలైజ్‌ స్కీమ్‌ (బీపీఎస్‌) కింద రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ప్రభుత్వం జనవరిలో అవకాశమిచ్చారు. ఇందుకోసం ఆగస్టు 31వ తేదీ గడువు విధించింది. గడువు ముగిసే నాటికి సీఆర్‌డీఏ పరిధితో çసహా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాల్టీల్లో 8,321 దరఖాస్తులు అందాయి. వాటిలో ఇప్పటి వరకు 980 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించడం ఈ పథకం పట్ల ఏ స్థాయిలో నిర్లక్ష్యం తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 20 దరఖాస్తులను తిరస్కరించగా, 6,689 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. కాగా 623 దరఖాస్తులను కనీసం పరిశీలన కూడా చేయలేదు. ఇప్పటి వరకు పరిష్కరించిన దరఖాస్తుల ద్వారా జిల్లాలోని నగర, మున్సిపాల్టీలకు రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా సీఆర్‌డీఏ పరిధిలో 3,875 దరఖాస్తులందగా వాటిలో రెగ్యులరైజ్‌ చేసినవి 447 మాత్రమే. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 3,008 దరఖాస్తులందగా, రెగ్యులరైజ్‌ చేసినవి 343 మాత్రమే. అత్యల్పంగా నందిగామలో 257 దరఖాస్తులకు కేవలం రెండు దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగలిగారు. అయితే చేయి తడిపితే కానీ బీపీఎస్‌ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

బీపీఎస్‌ కింద అందిన దరఖాస్తులు    8,321 
ఇప్పటి వరకు పరిష్కరించినవి    980
వచ్చిన ఆదాయం   రూ. 21 కోట్లు 
వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులు   6,689

దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం సరికాదు  
టౌన్‌ ప్లానింగ్‌లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని సాకుగా చూపి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం సరికాదు. కమిషనర్లు బాధ్యతగా తీసుకుని వీటి పరిష్కారంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి.
– వైపీ రంగనాయకులు, ఆర్‌డీడీ, టౌన్‌ప్లానింగ్‌ విభాగం, రాజమండ్రి రీజియన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top