జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అధికారులు విస్మరించారు.
కర్నూలు(అగ్రికల్చర్),న్యూస్‌లైన్ : జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అధికారులు విస్మరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు ముందు ప్రతి సోమవారమూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండేవారు.
అయితే ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు అవి నిలిచిపోయాయి. డయల్ యువర్‌కలెక్టర్ ప్రారంభం కాకపోయినా సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తిరిగి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు అదనపు జేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. కొన్ని శాఖల నుంచి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కలెక్టర్ తదితరులు ప్రజల నుంచి వినతులు తీసుకుని ఎండార్స్‌మెంట్ రాసి ఫలానా అధికారిని కలువాలని సూచించి పంపారు.