గోవాడ సుగర్స్‌పై పచ్చనేత కన్ను!


చైర్మన్ పదవి  కోసం పావులు కదుపుతున్న వైనం!

పాలకవర్గం, ఫ్యాక్టరీ వర్గాల్లో తీవ్రచర్చ


 

చోడవరం: రాష్ట్ర సహకార రంగంలో అతిపెద్దదైన  గోవాడ సుగర్  ఫ్యాక్టరీపై తెలుగుదేశం పార్టీ పెద్దలు డేగకన్ను వేసినట్టు తెలిసింది. లాభాల బాటలో నడుస్తూ ఏటా 5 లక్షల టన్నుల చెరకు గానుగాడుతూ సుమారు రూ.130 కోట్ల టర్నోవర్‌తో  నడుస్తున్న ఈ ఫ్యాక్టరీని గతంలోనే చంద్రబాబు హయాంలో ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని యోచించిన సంగతి తెలిసిందే. అప్పట్లో టెండర్ల వరకు కూడా వెళ్లారు. అయితే ఇంతలో టీడీపీ అధికారం కోల్పోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ప్రైవేటీకరణకు బ్రేక్‌పడింది. వైఎస్ సహకార ఫ్యాక్టరీలకు నిధులిచ్చి బలోపేతం చేయడంతో   గోవాడ ఫ్యాక్టరీ రైతుల ఫ్యాక్టరీగా ఇప్పటివరకు మనుగడ సాగిస్తూ వస్తోంది.  తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక  ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా  స్వాధీనం చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బంధువైన  సుధాకర చౌదరి ఈ ఫ్యాక్టరీపై ఎప్పటి నుంచో కన్నేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 



గతంలో ఆయన ఈ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరక్టర్‌గా పనిచేశారు.   ఈ ఫ్యాక్టరీలో సభ్య రైతుగా కొన్ని షేర్లు కూడా ఆయనకున్నాయి. అప్పట్లో ఈ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో చవిచూసిన ఆయన ఎలాగైనా దక్కించుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఈ ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగానే  రాష్ట్రంలో సుగర్ ఫ్యాక్టరీల మనుగడపై గత ఏడాది ప్రభుత్వం వేసిన అధ్యయన కమిటీలో ఆయనొక కీలక సభ్యునిగా   నియమించారని ఇక్కడ చెప్పుకుంటున్నారు. దీనిపై అప్పట్లో ఈ ప్రాంత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు అధ్యయన కమిటీ చర్చల్లో సైతం రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంతజరిగినా ఆయన కన్ను మాత్రం గోవాడపైనే ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే అవకాశం లేకపోవడంతో ఏదో విధంగా పాగా వేయాలని ఆ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.  ఈ మేరకు   ఫ్యాక్టరీ  చైర్మన్ పదవి కోసం  విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తనకు అనుకూలంగా ఉన్న  డైరక్టర్లతో పాటు మరికొందరిని  తమ వైపు తిప్పుకొని ప్రస్తుతం ఉన్న చైర్మన్ గూనూరు మల్లునాయుడిని దింపేయాలనే ఆలోచనలో కూడా ఆయన పావులు కదుపుతున్న తెలిసింది.



అయితే ప్రస్తుత చైర్మన్ కూడా టీడీపీ వారే కావడంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ బోర్డును రద్దుచేసేలా కూడా వ్యూహం రచిస్తున్నట్టు ఫ్యాక్టరీ వర్గాల్లో  చర్చజరుగుతోంది. తనకు అనుకూలంగా ఉన్న ఒక డైరక్టర్‌ను రాజీనామా చేయించి ఆ స్థానంలో డైరక్టర్‌గా పోటీచేసి తర్వాత ఫ్యాక్టరీ చైర్మన్ కావాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఫ్యాక్టరీ వర్గాల్లో కొందరితో ఆయన లోపాయికారి మంతనాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహం వెనుక ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక లాబీంగ్ కూడా నడుపుతున్నారని ఫ్యాక్టరీ పాలకవర్గంలో ఉన్న కొందరు అధికారపార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మరి సుధాకరచౌదరి వ్యూహాన్ని ప్రస్తుత చైర్మన్ మల్లునాయుడు ఏవింధంగా ఎదుర్కొంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top