విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యం

NSUI Congress Rally In YSR  Kadapa - Sakshi

కడప వైఎస్సార్‌ సర్కిల్‌ : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి మొయప్పన్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్‌చాందీ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  అనంతరం ఏర్పాటు చేసిన నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన వెంటనే విభజచట్టంలోని ప్రత్యేకహోదా, జిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఇచ్చిన హామీలపై తొలి సంతకం చేస్తామన్నారు. వీటిపై ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని అన్నారు.

మాజీ మంత్రి కమలమ్మ మాట్లాడారు.  మాజీ మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు నిలబడి ఉందన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌ను నగర మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌ ఖాన్‌ సన్మానించారు. సభలో నేతలు ప్రసంగిస్తుండగా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌ చాందీ కునుకు తీశారు. పార్టీ అభివృద్ధి గురించి  చెప్పాల్సిన ఇన్‌చార్జే ఇలా కునుకు తీస్తే ఎలాగని  కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బండి జకరయ్య, నీలి శ్రీనివాసరావు, జి.నాగరాజు, సత్తార్, పది నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top