నో బ్యాగ్‌.. నో హోంవర్క్‌

No Bag No Homework For Primary Children's - Sakshi

1,2వ తరగతి చిన్నారులకు విముక్తి

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్న పాఠశాలలకు వర్తింపు

మార్గదర్శకాలు విడుదల చేసిన సీబీఎస్‌ఈ బోర్డు

జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రభావం

గుంటూరు ఎడ్యుకేషన్‌: బుడి బుడి అడుగులు వేసుకుంటూ పాఠశాలకు వెళ్లే చిన్నారులకు పుస్తకాల బ్యాగుల భారం తొలగనుంది. ఉదయాన్నే పుస్తకాల బ్యాగులను భుజానికెత్తుకుని, పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వీపులు ఒంగిపోయే రీతిలో అవే బ్యాగులను మోసుకురావాల్సిన అవసరం ఇకపై ఉండదు. మోయలేని భారంగా మారిన బ్యాగులు, ఇంటికి వెళ్లాక సైతం వదలని హోంవర్క్‌ భారం నుంచి చిన్నారులకు ఉపశమనం కలిగిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేప«థ్యంలో జిల్లాలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్న పాఠశాలల్లో వీటిని అమలు చేయాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు బండెడు పుస్తకాలతో నిండిన బ్యాగులు, హోం వర్క్‌ కారణంగా వారిలో ఎదిగే వయసులో సహజంగా బయటకు రావాల్సిన సృజనాత్మకత నైపుణ్యాలు దెబ్బతిని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సందర్భంలో 6,7 ఏళ్ల వయసు చిన్నారులకు ఇది ఎంత మాత్రం సరైనది కాదని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు సైతం వారితో ఏకీభవించి, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీబీఎస్‌ఈ బోర్డును ఆదేశించింది. సీబీఎస్‌ఈ బోర్డు ఉత్తర్వుల ప్రకారం 1, 2వ తరగతుల చిన్నారులకు నో బ్యాగ్‌... నో హోం వర్క్‌ను అమలు పర్చాల్సి ఉంది.ఈ విధానంపై సీబీఎస్‌ఈ బోర్డు గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. ర్యాంకులు, మార్కుల వేటలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ విధానానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నాయి. దీంతో సీబీఎస్‌ఈ బోర్డు ఉత్తర్వులు అటకెక్కాయి.  దీనిపై పలువురు విద్యావేత్తలు ఇటీవల మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనలతో ఏకీభవించింది.

ఒకటి, రెండో తరగతులకు అమలు
సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపధ్యంలో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అమలు పర్చే విధానంపై అధికార యంత్రాంగం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.  కాగా జిల్లాలో సీబీఎస్‌ఈ బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలలు 40 ఉండగా, గుంటూరు నగర పరిధిలోని కేంద్రీయ విద్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యంలో మరో 39 పాఠశాలలు ఉన్నాయి.

చర్యలు చేపడతాం
సీబీఎస్‌ఈ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో సీబీఎస్‌ఈ సిలబస్‌ నిర్వహిస్తున్న పాఠశాలలకు ఆదేశాలు జారీ చేస్తాం. సీబీఎస్‌ఈ బోర్డు ఉన్నతాధికారులను సంప్రదించి సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తాం. సీబీఎస్‌ఈ సిలబస్‌లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు ఈ విధానాన్ని విధిగా అమలు పర్చాల్సిందే.  – ఆర్‌ఎస్‌ గంగాభవానీ,జిల్లా విద్యాశాఖాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top