
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే ప్రీ టీనేజర్‌లు, ఉపయోగించని లేదా తక్కువగా ఉపయోగించే వారితో పోలిస్తే చదువులో వెనకబడిపోతున్నారని, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని తాజా అధ్యయనం ఒకటి తెలియజేస్తుంది. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జమ)లో ప్రచురించబడ్డాయి.
‘పిల్లలు గతంలోలాగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే సమాచారాన్ని ప్రాసెస్ చేసే వారి సామర్థ్యాన్ని సోషల్ మీడియా మార్చేసింది. పిల్లలు బడిలో సోషల్ మీడియా వాడడం అనేది వారి అభ్యాసంపై ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ తాజా అధ్యయనం ఉపయోగపడుతుంది’ అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత, శిశువైద్య నిపుణుడు జాసన్ నగటా.
ఈ అధ్యయనం కోసం జాసన్ అతని బృందం కౌమారదశపై జరుగుతున్న అధ్యయనాలలో ఒకటైన అడోలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్(ఏబీసీడీ) స్టడీ నుంచి డేటాను ఉపయోగించుకుంది. జాసన్ బృందం తొమ్మిది నుంచి పది సంవత్సరాల వయస్సుగల ఆరువేల మందికి పైగా పిల్లలకు సంబంధించిన డేటాను తమ అధ్యయనానికి ఉపయోగించుకుంది.
సోషల్ మీడియాను ఉపయోగించే పిల్లలను మూడు గ్రూప్‌లుగా విభజించారు. వారిలో ఆరు శాతం మంది పిల్లలకు ‘హై ఇంక్రీజింగ్ సోషల్ మీడియా గ్రూప్’గా నామకరణం చేశారు. ఈ పిల్లలు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు.