
పెరుగుతున్న షార్ట్–ఫామ్ వీడియోల వ్యసనం
జూదం, మాదకద్రవ్య వినియోగంతో సమానమే
ఆర్థిక నష్టాన్ని కూడా పట్టించుకోని మానసిక స్థితి.. క్రమంగా మెదడు కూడా ‘దారి తప్పే’ ప్రమాదం
రీల్స్, షార్ట్స్ చూడందే పొద్దు గడవని రోజులు వచ్చేశాయి. ఎక్కడ చూడండి, ఎవరిని చూడండి, ఎప్పుడు చూడండి.. వీటిలోనే లీనమైపోయి కనిపిస్తుంటారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అతుక్కుపోతున్నారు. ఒకసారి ఈ రీల్స్ లేదా షార్ట్స్ ప్రపంచంలోకి వెళ్లామంటే.. వరుసపెట్టి ఎన్ని చూస్తామో మనకే తెలీదు.
ఈ షార్ట్ వీడియోలు మనల్ని ఎందుకు ఇంతలా కట్టిపడేస్తున్నాయి? ఎందుకంటే అవి మనల్ని నవ్విస్తాయి. కవ్విస్తాయి. కబుర్లు చెబుతాయి. చాలావాటిలో మన చుట్టుపక్కల వాళ్లే కనిపిస్తారు. అన్నిటినీ మించి – సెకన్లలో, నిమిషాల్లో కొద్దిపాటి నిడివితో ముగుస్తాయి. ఒకప్పుడు కాలక్షేపంతో మొదలైన ఈ వీక్షణ ఇప్పుడు ఓ వ్యసనంలా మారింది. స్వ.. షార్ట్ వీడియోల వ్యసనం (ఎస్‌వీఏ) అని పిలిచే ఈ వ్యసనం వల్ల మన మెదడు పనితీరే మారిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి బాంబును పేల్చింది.
రీల్స్, షార్ట్స్, వగైరాలను చూసే అలవాటు కనుక మితిమీరితే మెదడులోని ‘రీవైరింగ్’ ప్రక్రియ గతి తప్పి మనిషి మనస్తత్వంలో ప్రతికూల మార్పులు సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. సుప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘న్యూరోఇమేజ్’లో వచ్చిన ఈ పరిశోధనా వ్యాసం ప్రధానంగా షార్ట్–ఫామ్ వీడియోల వ్యసనం (ఎస్‌వీఏ – స్వ) వల్ల ప్రవర్తనల్లోని పెను మార్పుల గురించి చర్చించింది.
‘స్వ’ మెదడు కార్యకలాపాలను తారుమారు చేయగలదని, వాటికి అలవాటు పడిన వారిని మరింత ఉద్వేగభరితంగా, ఆర్థిక నష్టాలను సైతం పట్టించుకోనంతగా మొద్దుబారేలా చేస్తుందని ఈ కొత్త బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు, ఇలాంటివారు తొందర పడి తక్షణ నిర్ణయాలు తీసుకుంటారని, ఆ నిర్ణయ దుష్ఫలితాల పట్ల కూడా అవసరమైన స్పందన చూపించరని పేర్కొంది. తద్వారా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ వారి అభివృద్ధి కుంటు పడుతుందని తెలిపింది.
మెదడు దారి తప్పుతోంది..
‘స్వ’ అన్నది జూదం, మాదకద్రవ్య వినియోగం వంటి వ్యసనాల కంటే తక్కువేమీ కాదని తెలిపింది. ఈ రెండు రకాలైన వ్యసనాల్లోనూ వ్యక్తులు దీర్ఘకాలిక పరిణామాలను విస్మరించి, తక్షణ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా – నిర్ణయాలు తీసుకోవటానికి, నియమాలను పాటించటానికి కారణమయ్యే మెదడులోని ప్రదేశాలు తమ తీరు మార్చుకుని దారి తప్పుతున్నట్లు అధ్యయనం కనిపెట్టింది.
ఊటబావుల్లాంటివి
షార్ట్–ఫామ్ వీడియోలు ఊటబావుల వంటివి. స్క్రోలింగ్ చేయటానికి ఓపిక ఉండాలే కానీ వాటిల్లో అంతులేని కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ కూడా మనకు నచ్చేలా, మనకు సంబంధించిన విషయమని అనిపించేలా ఉంటుంది. వాటి వల్ల తక్షణ మానసిక సంతృప్తి లభిస్తుంది. అదొక తీరని దాహం అవుతుంది. దీంతో మెదడు ఒత్తిడికి గురై, మెదడు ‘రీవైరింగ్’ పని తీరులో మార్పులు సంభవిస్తాయి. పర్యవసానంగా ప్రమాదాలను పసిగట్టే, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ‘చివరికి అది ఎంతవరకు దారి తీస్తుందంటే – బతుకు బండిని నడిపించే డబ్బు విషయాల్లో జరిగిన నష్టాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు’ అని అధ్యయనం తెలిపింది.
మెదడు ‘రీవైరింగ్’ అంటే?
రీవైరింగ్‌నే మెదడు పునఃశిక్షణ, న్యూరోప్లాస్టిసిటీ అని కూడా అంటారు. మెదడు నిరంతరం, జీవితాంతం కొత్త నాడీ సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఆ విధంగా తన పునర్వ్యవస్థీకరణ సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. మనిషి తన అనుభవాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి, గాయాల నుంచి కోలుకోవటానికి; అలవాట్లను, ఆలోచనా విధానాలను మార్చుకోవటానికి అనుమతిస్తుంది. అయితే షార్ట్–ఫామ్ రీల్స్‌ను అదేపనిగా చూసే అలవాటు మెదడు ఇలా రీవైరింగ్ చేసుకోవటాన్ని నిరోధిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.
నిద్రలేమి... నిరాశ నిస్పృహలు
‘స్వ’.. మొత్తం ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది. తాజాగా అధ్యయనం జరిగిన చైనాలో వినియోగదారులు సగటున రోజుకు 151 నిమిషాలు ఈ వీడియోలనే చూస్తూ గడుపుతున్నారు. దాదాపు 95.5 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు వీటిలోనే నిమగ్నమై ఉంటున్నారు. ఈ తీవ్రత.. ఏకాగ్రత, నిద్ర, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, నిరాశాæ నిస్పృహలను దరిచేర్చే ప్రమాదం ఉందని చైనాలోని టియాంజిన్ నార్మల్ విశ్వవిద్యాలయం సైకాలజీ ప్రొఫెసర్, అధ్యయన కర్త కియాంగ్ వాంగ్ అంటున్నారు.
ఎందుకు స్పందించడం లేదు?
ముఖ్యంగా, ‘స్వ’ ఉన్నవారిలో ఆర్థిక నష్టాల పట్ల పట్టింపు ఎందుకు ఉండటం లేదో కనుగొనాలని పరిశోధనా బృందం ప్రయత్నించింది. లాభాల కంటే నష్టాలకు ఎక్కువగా స్పందించే ధోరణిని.. నిర్ణయం తీసుకోవడంలో ముందు జాగ్రత్త లక్షణంగా పరిగణిస్తారు. ఈ లక్షణం ప్రమాదకర ప్రవర్తనను నివారించడానికి సహాయపడుతుంది.
జూదం, మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైన వారు తమ ఆర్థిక నష్టాల పట్ల కాస్తయినా స్పందనను చూపుతుండగా, షార్ట్–ఫామ్ వీడియో వ్యసనంలో ఇందుకు భిన్నంగా ఉండటానికి కారణాన్ని మాత్రం అధ్యయం కచ్చితంగా తేల్చలేకపోయింది. దానిని కనిపెట్టటానికి వారు ఈ రెండు రకాల వ్యసనాల కంప్యూటేషనల్ మోడలింగ్ (డీడీఎం), న్యూరోఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ)లను ఆశ్రయించారు. కారణాల కోసం అన్వేషిస్తున్నారు.
యువతపై తీవ్ర ప్రభావం
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ గతంలో నిర్వహించిన అధ్యయనంలో యుక్త, మధ్య వయస్కుల్లో.. షార్ట్స్, రీల్స్ చూడటం వల్ల ఒక పని మీద ధ్యాస, శ్రద్ధ ఉండకపోవడం గమనించారు. ముఖ్యంగా రకరకాల అంశాలకు సంబంధించిన చాలా స్వల్ప వ్యవధి వీడియోలు మార్చి మార్చి చూడటం వల్ల... యువత ఒక సమయంలో ఒకే పనిమీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తేలింది.
దేశంలోని నెట్ వినియోగదారుల్లో 80 శాతానికిపైగా షార్ట్ ఫామ్ వీడియోలు రోజూ వీక్షిస్తున్నారు.
ఇండియాలో నెట్ యూజర్లు రోజుకు గంటకుపైగానే షార్ట్–ఫామ్ వీడియోలు చూస్తున్నారని ఒక అంచనా.