
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 0.1 శాతమే సక్సెస్ రేటు
తొలి ప్రయత్నంలోనే సత్తా చాటేవారు 7 శాతమే
ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాల్లోనే 93 శాతం మంది విజయం... లక్షల్లో అభ్యర్థులు
పెరుగుతున్నా ఖాళీల సంఖ్య స్వల్పమే
ఏటా 1,000కి మించి పెరగని పోస్టులు
ప్రిపరేషన్‌కు సుదీర్ఘకాలం వెచ్చించాలి
(మహేశ్వర్ పెరి, ఫౌండర్ చైర్మన్ కెరీర్స్ 360) : దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలను ‘మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్’గా భావిస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్), తదితర సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ లక్ష్యంగా ఏటా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ఏటా దాదాపు వెయ్యి ఖాళీలు మాత్రమే అందుబాటులో ఉంటున్నా సుమారు 11 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతటి పోటీపరీక్షలో నెగ్గాలంటే పట్టుదల, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులపైన పట్టు తప్పనిసరి. చాలా తక్కువ సక్సెస్ రేటు మాత్రమే ఉన్న ఈ పరీక్షల్లో విజయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మొదటి ప్రయత్నంలోనే ఏదో ఒక సర్వీసును దక్కించుకుంటున్నవారు కేవలం 7 శాతం మాత్రమే ఉంటున్నారు. మిగతా 93 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం కొనసాగే ఈ పరీక్షల ప్రిపరేషన్ యువతపై అధిక భారాన్ని మోపుతూ వారు నేర్చుకునే సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది యువత కృషి, సమయం వృథా అవుతోంది. వారిపై ఒత్తిడి, వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సుదీర్ఘ ప్రిపరేషన్ యువత నేర్చుకునే సామర్థ్యాన్ని, వారి విమర్శనాత్మక ఆలోచనను హరించివేసే ప్రమాదముంది.
దరఖాస్తులు పెరుగుతున్నప్పటికీ ఆ మేర పెరగని ఖాళీలు యూపీఎస్సీని ప్రెషర్ కుక్కర్‌గా మార్చాయి. అంతిమంగా ఈ స్థితి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు లాభం చేకూర్చుతోంది. యూపీఎస్సీ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా తప్పనిసరిగా చర్చ జరగాలి. దేశంలో యువతతోపాటు అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి’ అని నిపుణులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
ఖాళీలు కొన్నే.. అభ్యర్థులు లక్షల్లో..
ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో చేరి ప్రజాసేవ చేయాలనుకునే అభ్యర్థులు సివిల్స్‌ను ఒకప్పుడు కఠినమైన పరీక్షగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్షలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కేవలం కొన్ని ఖాళీల కోసం ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2000 సంవత్సరంలో ఒక్కో ఖాళీకి 365 మంది పోటీపడేవారు. ఇటీవల ఈ పోటీ మరింత అధికమైంది. 2020–23 మధ్య ఏటా దాదాపు 11.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు మాత్రం ఏటా దాదాపు వెయ్యి మాత్రమే ఉన్నాయి.

చాలా తక్కువ విజయశాతం
అత్యంత కఠినమైన పరీక్ష అయిన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విజయం కోసం కొన్నేళ్లపాటు వేచిఉండాల్సి వస్తోంది. 2013కు ముందు ప్రతి 365 మంది అభ్యర్థులకు ఒకరిగా ఉన్న సక్సెస్ రేటు ఆ తర్వాత ప్రతి 1,215 మంది అభ్యర్థులకు ఒకరికి పడిపోయింది. అంటే.. సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో విజయ శాతం 0.1%, వైఫల్య శాతం 99.9%. ఇదంతా ఒక దశాబ్దంలో జరిగింది.
సుదీర్ఘ ప్రిపరేషన్..
సివిల్స్ పరీక్షల్లో ప్రయత్నాల పెంపు అభ్యర్థులకు మేలు చేయడానికి బదులుగా వారిని సుదీర్ఘ కాలం పాటు పరీక్షల ప్రిపరేషన్‌కే పరిమితమయ్యేలా చేసింది. 2014కు ముందు చాలామంది 2 లేదా 3వ ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవారు. ప్రయత్నాల సంఖ్య పెంచాక ఈ సగటు 3–4కు పెరిగింది. సివిల్స్‌లో విజయం సాధించడానికి 93% మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు తీసుకుంటుండటం గమనార్హం.
తొలి ప్రయత్నంలో విజయం సాధించేవారు 7 శాతమే ఉంటున్నారు. అభ్యర్థులు తమ తొలి ప్రయత్నానికి ముందు రెండేళ్ల ప్రిపరేషన్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఆరేళ్లకు పైగా తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో సివిల్స్ ప్రతిభ పరీక్షగా కంటే ఓర్పు పరీక్షగా మారిందని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంత ఎక్కువ సమయం, డబ్బు, మానసిక బలాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితేనే పరీక్షలో అంతగా అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
టాప్ ర్యాంకర్లు సైతం..
సివిల్స్‌లో టాప్ ర్యాంకర్లు సైతం 3 నుంచి 5 ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకుంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనేది చాలామందికి కలగానే మిగులుతోంది. 2024లో టాపర్‌గా నిలిచిన శక్తి దూబే మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ను కూడా దాటలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్ దాటినా ఇంటర్వూ్యలో విఫలమైంది. 5వ ప్రయత్నంలో ఆమె టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. ఆమె 2018 నుంచి సివిల్స్‌కు సిద్ధమైతే 2025లో ఐఏఎస్ అధికారిణి అయ్యారు.
అంటే.. శక్తి దూబేకు ఐఏఎస్ అధికారిణి కావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టింది. అలాగే 2024లో రెండో ర్యాంకు సాధించిన హర్షిత గోయల్ 3 ప్రయత్నాల్లో, మూడో ర్యాంకు సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్ 2, నాలుగో ర్యాంకు సాధించిన షా మార్గి చిరాగ్ 5, ఐదో ర్యాంకు సాధించిన ఆకాశ్ గార్గ్ 2, ఆరో ర్యాంకు సాధించిన కోమల్ పునియా 3, ఏడో ర్యాంకు సాధించిన ఆయుషి బన్సాల్ 3, ఎనిమిదో ర్యాంకు సాధించిన రాజ్ కృష్ణ ఝా 5, తొమ్మిదో ర్యాంకు సాధించిన ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 5, పదో ర్యాంకు సాధించిన మయాంక్ త్రిపాఠి 3 ప్రయత్నాల్లో విజయం సాధించారు.
అంటే.. టాప్ పది మందిలో 8 మంది సివిల్స్ సాధించడానికి 3–5 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద దాదాపు 93% మంది విజయవంతమైన అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు సివిల్స్ కోసం ప్రయత్నించారు. తొలిసారి పరీక్షలకు హాజరైనవారిలో దాదాపు 7% మంది మాత్రమే విజయం సాధిస్తున్నారు.
పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా?
ఏమీ నేర్చుకోకుండా పరీక్షకు సిద్ధమవుతున్న వారి ప్రాథమిక సంవత్సరాలను వృథా చేసుకోకుండా ఉండటానికి సివిల్స్ ప్రయత్నాల సంఖ్య, గరిష్ట వయసును పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? 6వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి మొదటి ప్రయత్నంలోనే ఫెయిలైన అభ్యర్థి కంటే మెరుగైనవాడా? మనం మెరిట్‌ను ఎలా అంచనా వేస్తాం? ప్రయత్నాలు, తీసుకున్న సంవత్సరాల ఆధారంగా విజయానికి వెయిటేజ్ ఇవ్వబడిందా?.. వీటిపైన దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి.
పరీక్ష విధానం మార్పుతో మలుపు
యూపీఎస్సీ చరిత్రలో 2013 ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఆ ఏడాది పరీక్షకు కొన్ని నెలల ముందు యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష విధానాన్ని మార్చింది. జనరల్ స్టడీస్ పేపర్లను పెంచి వెయిటేజీలో మార్పులు తెచ్చింది. దీంతో ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనలు చేశారు. అదనపు ప్రయత్నాలు, వయోపరిమితి సడలింపు రూపంలో ఉపశమనం కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం 2014 నుంచి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి మరో రెండు అటెంప్ట్స్ అదనంగా అవకాశం కల్పించింది.
