అదనపు కట్నం కోసం వేధింపులు
కేసు నమోదు చేసిన పోలీసులు
తాడేపల్లి రూరల్/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.
ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసుకొచ్చామని చెప్పారు. తమ కుమార్తె
మృతికి కారణమైన
రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.
తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్‌కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు.


