ఒక పంట వరివేద్దాం.. మరో పంట మారుద్దాం
వరివల్ల డయాబెటిస్ వస్తుంది
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తిచేస్తాం
ఏలూరు జిల్లా గోపీనాథపట్నం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘వరి పంట వేస్తే.. కొనేవారే ఉండరు. ఒక పంట తప్పదు కాబట్టి వరి వేద్దాం.. మరో పంట మారుద్దాం. మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు సూచించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో సోమవారం జరిగిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. వరి వల్ల షుగర్ (డయాబెటిస్) వస్తుందన్నారు. రైతులు వాణిజ్యపంటల వైపు మరలాలని పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.
మహిళలు గంజాయి అమ్మకాల్లో లేడీ డాన్లుగా మారారు
మహిళలు గంజాయికి బానిసలవుతున్నారని, ఆడవారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారని, లేడీ డాన్లుగా మారారని పేర్కొన్నారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన చెప్పారు.


