‘లిఫ్ట్’ పాలసీ విధివిధానాలను విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పనంగా భూ పందేరానికి చంద్రబాబు ప్రభుత్వం తెర తీసింది. కేవలం 99 పైసలకే ఎకరం చొప్పున కంపెనీలకు ఎన్ని ఎకరాలైనా ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేస్తోంది. ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లను ఆకర్షించే పేరుతో ఎంత భూమి అయినా 99 పైసలకే కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం ‘ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2025–2030’ని రూపొందించింది. లిఫ్ట్ పాలసీ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ పాలసీ కింద ఐటీ కంపెనీలు, ఐటీఈఎస్, జీసీసీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ డెవలపర్స్, ఐటీ పార్క్ డెవలపర్స్ తక్కువ ధరకు భూమిని పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
పెద్ద కంపెనీలకు ఎంత భూమి అవసరమైనా మొత్తం 99 పైసలకే కేటాయిస్తామని నిబంధనల్లో స్పష్టంచేశారు. మధ్య స్థాయి కంపెనీలైతే రాయితీ ధరపై ఎకరం రూ.4 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా ఐటీ, జీసీసీ పాలసీ కింద ఇతర రాయితీలూ అందించనున్నట్లు స్పష్టంచేశారు. పెద్ద కంపెనీలు ఒక్కో ఎకరానికి 500 చొప్పున ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు. భారీ ఐటీ కంపెనీలు కనీసం మూడేళ్లుగా రూ.8,900 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉండాలని, ఐటీ డెవలపర్స్ ఇప్పటికే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేసి ఉండాలని పేర్కొన్నారు. మధ్యస్థాయి కంపెనీలైతే మూడేళ్లలో కనీసం రూ.30 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని, 500 ఉద్యోగాలు ఇచ్చి ఉండాలని స్పష్టం చేశారు.


