
నేపాల్‌లో అక్కడి జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం(Gen-Z Protest) అదుపు తప్పింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ఖాట్మాండులో కొనసాగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా 20 మంది మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నేపాల్ రాజధాని ఖాట్మాండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘోరాహీ వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్‌లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో.. పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని కె.పి. శర్మ ఓలి స్వస్థలం ధమాక్‌కూ ఈ నిరసనలు విస్తరించాయి.

ఆందోళన వెనుక కారణాలు
కిందటి ఏడాది ఆగస్టు/సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీం కోర్టు.. అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్‌లో నమోదు కావాలి అని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్.. కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి.
ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి.. 7 రోజుల గడువుతో అధికారిక నోటీసు ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్‌లను(యాప్‌లను) బ్లాక్ చేసి పడేసింది.
అభ్యంతరాలు అందుకే..
ప్రభుత్వ చర్యలను Gen-Z యువత సెన్సార్‌షిప్‌గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్‌లో కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్‌టాక్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో.. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తు అని.. మరి తమ పరిస్థితి ఏంటని? నిలదీస్తున్నారు. ఈ క్రమంలో.. రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొసమెరుపు ఏంటంటే.. టిక్‌టాక్‌ను కిందటి ఏడాది నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్‌ను ఎత్తేసింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది.
ప్రభుత్వం స్పందన
నియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశం అని ప్రభుత్వం చెబుతోంది.
స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం అని అంటోంది.
నిరసనల్లో.. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్‌లు, టియర్ గ్యాస్, రబ్బర్ తూటాలు ప్రయోగించారు. పలు చోట్ల కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులు గాయపడ్డారు. ఖాట్మాండు బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరించబడింది.

ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం.. నేపాల్‌లో కోటి 35 లక్షల మంది ఫేస్‌బుక్ యూజర్లు ఉన్నారు. 36 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. వ్యాపారాలపై కోసం చాలామంది ఆధారపడి ఉన్నారు. అలా.. బ్యాన్ నేపథ్యంలో అన్నివిధాల నిరసనలు ఊపందుకున్నాయి. Gen-Z (Generation Z) అనేది 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన వ్యక్తుల తరం. జెన్ జెడ్ ఏం చెబుతోంది అంటే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం కాదు, అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం. ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేసే ఆలోచనలో నేపాల్ ప్రభుత్వం ఉన్నట్లు అక్కడి మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.