
కాఠ్‌మాండూ: నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారుల్ని నిలువరించేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు చేసిన ప్రయత్నాల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.
అయినప్పటికీ నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో జెడ్ జనరేషన్ మొదలు పెట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన కారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పూర్వీకుల ఇంటిపై రాళ్లు విసిరారు. రాజధాని కాఠ్‌మాండూతో పాటు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాని ఓలి స్వస్థలమైన దమక్ వరకు ఈ ఉద్యమం విస్తరించింది. కోశీ ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
నేపాల్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తోంది. ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో యువతకు భయపడిన నేపాల్ ప్రభుత్వం గత గురువారం(సెప్టెంబరు 4) మెటా,యూట్యూబ్,ఎక్స్.కామ్ ఇలా మొత్తం 26 సోషల్ మీడియా ఛానెల్స్‌ను బ్యాన్ చేసింది.
దీంతో నేపాల్ యువత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెదవి విరిచింది. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఆదేశాల్ని నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
ఈ నేపథ్యంలో గత గురువారం నుంచి, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. జెనరేషన్‌జెడ్ యువత రాజధాని కాఠ్‌మాండూ నగర వీధుల్లో ఉద్యమాన్ని సోమవారం ముమ్మరం చేసింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి పారద్రోలడం,సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయడంతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేపాల్ హోం మంత్రి రాజీనామా
నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను ప్రధాని కేపీ ఓలికి అందజేశారు.