
నాకు 36 ఏళ్లు. నేను ఇటీ ఉద్యోగిని. ఒంగోలులో మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బయట లే– ఆఫ్ లు బాగా అవుతున్నాయి. మా కంపెనీలో కూడా కొంతమందిని తీసివేసి ఉన్న వాళ్ళతోనే పని నడిపిస్తున్నారు. దీనివల్ల ఆఫీసులో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. లాప్‌టాప్ ముందు 12–14 గంటలు కూచోవాల్సి వస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పని చేయాల్సి ఉంటుంది.
దీని ఫలితంగా నిద్ర పట్టడం లేదు. తలనొప్పితోపాటు. చికాగ్గా ఉంటోంది. ఇంట్లో భార్య పిల్లల మీద కూడా సహనం కోల్పోతున్నాను. జాబ్ వదిలేయాలనిపిస్తుంది. కానీ నాకున్న కమిట్‌మెంట్స్ వల్ల అది సాధ్యం కాదు. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో సలహా చెప్పగలరు.
– అశోక్, ఓంగోలు
అశోక్ గారు! మీరు చెప్పిన పరిస్థితి ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నదే. ‘వర్క్ ప్లేస్ స్ట్రెస్‘కు మీరే ఒక ఉదాహరణ. ఉద్యోగుల తీసివేత, టార్గెట్స్. డెడ్‌లైన్స్ వల్ల ఒత్తిడి పెరగడం సహజం, కానీ దీని ప్రభావం మీ ఆరోగ్యం పైనే కాకుండా, కుటుంబ సంబంధాలపైనా పడుతోందన్న విషయాన్ని గమనించి దిద్దుబాటు కోసం ‘సాక్షి’ని సంప్రదించడం అభినందనీయం.
మొదటగా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం మానెయ్యాలని ఎవరికైనా అనిపించడం సహజం. కానీ తమకున్న కమిట్‌మెంట్స్, బాధ్యతల వల్ల అలా మానివేయడం చాలా సందర్భాల్లో కుదరదు. కనుక ఉద్యోగం చేస్తూనే ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధం అవడం ఉత్తమం. పని, ఆరోగ్యం, కుటుంబం–ఈ మూడిటి మధ్య సమతౌల్యం పాటించాలి. పని సమయంలో చిన్న చిన్న విరామాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి 1–2 గంటలకు, ఐదు ఏమిషాలు నడవండి. లోతుగా శ్వాస తీసుకొని వదిలే ’డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది.
అర్ధరాత్రి వరకు లాప్‌టాప్ ముందు కూర్చోవడం శరీరానికి, నిద్రకి తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి. మీ మేనేజర్‌తో మాట్లాడి రాత్రిపూట ఒక కటాఫ్ టైమ్ పెట్టుకోండి. ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వారాంతాల్లో వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కుటుంబంతో గడపడానికి ఫిక్స్‌డ్ టైమింగ్స్ పెట్టుకోండి. ఉదాహరణకు డిన్నర్ సమయంలో ఫోన్, లాప్‌టాప్ దూరంగా పెట్టేయండి.
ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. మీ కుటుంబానికి కూడా మీరు ఎమోషనల్‌గా అందుబాటులో ఉన్నారు అన్న భరోసా ఇస్తుంది. అలాగే వ్యాయామం ధ్యానం, యోగా లాంటి పద్దతులు మీ రోజు వారీ షెడ్యుల్లో చేరిస్తే ‘స్ట్రెస్ హర్మోన్లు’ తగ్గుతాయి. దీనివల్ల నిద్ర మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది.
ఇవన్నీ చేసినా కూడా మీరు ఇంకా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లయితే, ఒక మానసిక వైద్య నిపుణుడిని కలిసి స్ట్రెస్ మేనేజ్ చేసే టెక్నిక్స్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. టార్గెట్స్, ప్రాజెక్ట్ మళ్ళీ వస్తాయి, కానీ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మీకు మీ కుటుంబానికి, మీ కెరీర్‌కి కూడా దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)
(చదవండి: ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..! ఏకంగా రెండుసార్లు కేన్సర్ బారినపడ్డప్పటికీ..)