తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని
కాకినాడ సిటీ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.రాజులోవ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు ఆర్.తిరుపతిరావు, యు.గనిరాజు విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ సంఘాలు పిలుపునిచ్చిన శుక్రవారం నాటి విద్యాసంస్థల రాష్ట్రవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. రాష్ర్ట పాలకులు క్లస్టర్, ఆదర్శ, గురుకులాల పేరుతో వేలాది పాఠశాలలను మూసివేస్తున్నారని, డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని పెట్టడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు, యూనివర్శిటీలకు మేలు చేకూర్చాలని భావిస్తున్నారని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వారు ఆరోపించారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కొత్త పద్ధతులతో విద్యార్థులను పథకానికి అనర్హులను చేస్తున్నారన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆడపిల్లలకు సైతం మరుగుదొడ్లు సౌకర్యం కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ దురాచారాన్ని అరికట్టాలని, అందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.