విశాఖకు ఇది శుభోదయం

New Rail Uday Express Starts from Vizag To Vijayawada - Sakshi

సుదీర్ఘ నిరీక్షణకు తెర

పరుగు ప్రారంభించిన ‘ఉత్కృష్ట’ రైలు

పచ్చజెండా ఊపిన కేంద్ర మంత్రి సురేష్‌ అంగాడి

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు కూత పెట్టింది. పరుగు ప్రారంభించింది. అతి తక్కువ సమయం, తక్కువ చార్జీలు, మెరుగైన సౌకర్యాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది. గురువారం ఉదయం 11.30 గంటలకు రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడి జెండా ఊపి ఈ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. అలాగే వాల్తేర్‌ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్‌ పరిశీలనలో ఉందన్న మంత్రి వెల్లడించారు.

సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ): ‘విశాఖవాసులకు ఇది శుభోదయం.. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సమయం . అతి తక్కువ ప్రయాణ సమయం, ఏసీ, డైనింగ్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది’ అన్నారు  రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్‌ చెన్నబసప్ప. విశాఖ రైల్వేస్టేషన్‌లో గురువారం దీనిని ప్రత్యేక రైలుగా ఆయన ప్రారంభించారు. అతిథులు, డీఆర్‌ఎం, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేక రైళ్లను బిజీ రూట్లలో మాత్రమే నడుపుతామని, విశాఖ ప్రజలకు దీని అవసరం ఉండటంతో ఉదయ్‌ను ఏపీకి కేటాయించామన్నారు. 

రైల్వేలో ఆ మూడింటికి ప్రాధాన్యం
మోదీ ప్రభుత్వం రైల్వేలో మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటిది ప్రయాణికుల భద్రత, రెండోది పరిశుభ్రత, మూడోది సమయపాలన అని తెలిపారు. ఈ మూడింటిని రైల్వే కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. 


ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న  రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చెన్నబసప్ప, డీఆర్‌ఎం శ్రీవాస్తవ, ఎంపీలు జీవీఎల్, ఎంవీవీ

తీరిన విశాఖ వాసుల చిరకాల కోరిక
విశాఖవాసుల చిరకాల కోరిక విజయవాడకు విశాఖ నుండి డైరెక్ట్‌ రైలు నడపడం. నేడు ఉదయ్‌ ప్రారంభంతో ఈ కోరిక తీరిందని వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీ వాస్తవ అన్నారు. రైల్వేస్టేషన్‌లో ఉదయ్‌ ప్రారంభం సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడారు. ఉదయ్‌ సర్వీస్‌ ప్రారంభంతో విశాఖవాసులకు విజయవాడ ప్రయాణం చాలా అనుకూలంగా మా రిందన్నారు. నగరవాసులు విజయవాడలో తమ పనులు చూసుకుని తిరిగి రాత్రికి నగరానికి చేరుకునే విధంగా ఈ టైంటేబుల్‌ ఉం దని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్‌.మాధవ్, పాకలపాటి రఘువర్మ, దువ్వారపు రామారావు, మాజీ ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

తిరుగుప్రయాణం ఫుల్‌ 
విశాఖ నుంచి గురువారం ప్రారంభమైన ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి పూర్తి ఆక్యుపెన్సీతో వచ్చినట్లు తెలిసింది. విశాఖ నుంచి కూడా ప్రకటించిన అతి కొద్ది సమయంలోనే సీట్లు చాలావరకు నిండిపోయాయి. విజయవాడ నుంచి కూడా అన్ని కోచ్‌లు ఫుల్‌గా వచ్చాయి. 

డివిజన్‌ విషయంలో మాకు చేతనైనంత చేస్తాం
విశాఖకు ప్రత్యేక జోన్‌ కేటాయింపు పెద్ద వరమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. డివిజన్‌ విషయంలో చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

విశాఖ అందాలు అద్భుతం
విశాఖ నగర సౌందర్యానికి ముగ్ధులైన ఆయన అనంతరం స్టేషన్‌ నిర్వహణ చూసి డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ను ప్రశంసించారు. విశాఖ రైల్వేస్టేషన్‌ ఎంతో అందంగా ఉందని, స్టేషన్‌ను ఇలా ఉంచడంలో డీఆర్‌ఎం, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. విశాఖలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండో విస్టాడోమ్‌ కోచ్‌ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top