ప్రతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త నేతలను దిగుమతి చేసుకుంటోంది. రానున్న ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు :ప్రతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త నేతలను దిగుమతి చేసుకుంటోంది. రానున్న ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తోంది. జిల్లాలోని అనేక నియోజకవర్గాలకు ఇతర ప్రాంతాల నేతల పేర్లను అధినేత చంద్రబాబు పరిశీలిస్తున్నారు. దీంతో బాబు మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికీ, బీసీలకు 100 సీట్లు అని గతంలో వల్లించిన హామీలు ఏవీ నెరవేరే సూచనలు కనపడటం లేదు. దీంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. రాజకీయంగా గుంటూరు జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు సహజం. అయితే తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై అటు ప్రజలు, ఇటు ఆ పార్టీ కార్యకర్తలు సైతం అసహ్యాభావం వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు. బాపట్ల పార్లమెంటు స్థానాలతో పాటు గుంటూరు పశ్చిమ, మంగళగిరి, సత్తెనపల్లి, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి నిలిపేందుకు బడాబాబుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో గుంటూరు పార్లమెంటు స్థానానికి చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మాదల రాజేంద్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి ఓ ఐఏఎస్ అధికారిని పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు పార్టీ బడాబాబుల వేటలో పడింది. గత ఎన్నికల్లో పోటీచేసిన చుక్కపల్లి రమేష్ ఆ తర్వాత రాజకీయాల్లో కొన సాగలేదు.
అప్పటి నుంచి నియోజకవర్గంలోని కార్యక్రమాలను పార్టీ నేతలు యాగంటి దుర్గారావు, బోనబోయిన శ్రీనివాస యాదవ్‌లు చూస్తున్నారు. వీరు సీటు ఆశిస్తుండగా అధినేత మాత్రం కొత్తనేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఇదే నియోజకవర్గానికి తెనాలి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు పరిశీలనకు రావడంతో తొలి నుంచి ఇక్కడ సీటు ఆశిస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పోతినేని శ్రీనివాసరావు సీటు ఆశిస్తున్నా, పొత్తులు, ఎత్తుల్లో భాగంగా ఈ సీటు ఎవరికి వెళుతుందోనని నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు.
మరో వైపు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం టీడీపీ సీటు ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాల నుంచి వినపడుతోంది. మాచర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేయగా, ఉపఎన్నికల్లో చిరుమామిళ్ల మధుబాబు పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభమైంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నిమ్మకాయల రాజనారాయణ ఈ సారి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావును ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డితోపాటు కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు టీడీపీ వైపు కదులుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దిగుమతి నేతలపైనే టీడీపీ ఆధారపడటాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల తర్వాత వారు రాజకీయాల కంటే వ్యాపారాలకే ప్రాధాన్యత ఇవ్వడం రివాజుగా మారిందని ఆందోళన చెందుతున్నారు.