అడవి బిడ్డలను ఆదుకోవడానికి కొత్త చట్టం

New Act for the Tribals Welfare - Sakshi

జీవో నంబర్‌ 3 పై న్యాయపరమైన చర్యలు 

రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశంలో తీర్మానం

సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: గిరిజనులకు ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్‌ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది.  ఐటీడీఏలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు 153 కోట్లను కేటాయించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. జీవో నంబర్‌ 3 విషయంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రత్యేక సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో పాటుగా గిరిజన ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కళావతి, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, డైరెక్టర్‌ రంజిత్‌ బాషా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 

► జీవో నంబర్‌ 3పై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించాం. 
► ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులు, భాషలు, సంప్రదాయాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్థానికులైన గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటే ప్రయోజనం. 
► గిరిజన పిల్లలు చదువుకోవడానికి, డ్రాప్‌ అవుట్స్‌ తగ్గడానికి అవకాశం ఉంటుందని జీవో నంబర్‌ 3ని తీసుకొచ్చాం. 
► సుప్రీం తీర్పు తర్వాత సీఎం జగన్‌ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే 3 సార్లు సమావేశాలను నిర్వహించారు. 
► తెలంగాణకి చెందిన న్యాయశాఖ అధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌తోనూ సమన్వయ సమావేశాలను నిర్వహించాం. 
► సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయడానికి ఎలాంటి గడువు లేదు. కొంతమంది రాజకీయ దురుద్దేశాలతో జీవోపై రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు.
► కాగా, సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్‌ వేయడంతో పాటుగా ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top