దోమలు పెంచితే జైలే | Sakshi
Sakshi News home page

దోమలు పెంచితే జైలే

Published Sun, Mar 26 2017 2:15 AM

దోమలు పెంచితే జైలే - Sakshi

ముసాయిదాలో ఏముంది?
అధికారులు నోటీసు ఇచ్చిన 24 గంటల్లోగా తమ పరిసరాల్లో దోమలను నివారించాలి
లేదంటే సంబంధిత అథారిటీ చర్యలు తీసుకుంటుంది
ఇళ్లు, తోపుడు బళ్లు, ఇతర స్థలాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే రూ. 5 వేల వరకూ జరిమానా
భవన నిర్మాణం, హోటళ్లు తదితర చోట్ల రూ. 50 వేల ఫైన్, నెల రోజులు జైలుశిక్ష
త్వరలో కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది


సాక్షి, అమరావతి: దోమల పెంపకం ఏంటి.. జైలు ఏంటి, జరిమానా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అసలు దోమలను ఎవరైనా పెంచుతారా అనుకుంటున్నారా? ఇటీవల దోమలపై దండయాత్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దోమల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురాబోతోంది. తమ పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే ఆయా ప్రాంతాల యజమానులపై జరిమానా విధించనున్నారు. అంతేకాదు జైలుకు కూడా పంపించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

త్వరలోనే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈ చట్టం ప్రకారం.. నివాస గృహాలు, రహదారుల పక్కన తోపుడు బళ్లు పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే వాతావరణం సృష్టిస్తే తొలిసారి రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. అయినా కూడా రెండోసారీ అలాంటి వాతావరణాన్ని సరిదిద్దకపోతే రూ. ఐదు వేలు ఫైన్‌ వేస్తారు. అంతే కాకుండా దోమ గుడ్ల నివారణకు ఇచ్చిన గడువులోగా చర్యలు తీసుకోకపోతే రోజుకు రూ. వంద చొప్పున ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది. దోమల గుడ్ల పెరుగుదలకు కారణమయ్యే ఖాళీ స్థలాలు, భవన నిర్మాణ స్థలాలు, హోటళ్లు, ఆహార నిల్వ సంస్థలు, కల్యాణ మండపాలు, మైనింగ్‌ ప్రాంతాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు తొలిసారి రూ. 25 వేలు.. రెండోసారి రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. దీంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది.

కేంద్ర సంస్థలకు ఫైన్‌ తప్పదు..
రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, ఓడరేవులు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దోమల గుడ్ల పెరుగుదలకు కారణమైతే తొలిసారి రూ. 25 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారైతే రూ. 50 వేలు జరిమానా విధించడంతో పాటు బాధ్యులైన వారికి నెల రోజులు జైలు శిక్ష కూడా విధిస్తారు. అలాగే దోమల గుడ్లు పెరగడానికి కారణమైన ఇళ్లు, ఇతర భవనాలు, స్థలాలను తనిఖీ చేసే అధికారాన్ని సంబంధిత అథారిటీకి చట్టంలో కల్పించనున్నారు. దోమల నియంత్రణ చర్యల్లో ఉన్న అధికారులను ఆయా స్థలాల యజమానులు అడ్డుకుంటే.. జరిమానాతో పాటు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని డ్రైయిన్లు, కాల్వలు, ఇతర నీటి సంస్థలు దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత స్థానిక సంస్థల చైర్మన్లు లేదా అథారిటీపై కూడా కేసు నమోదు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తమ పరిసరాల్లో దోమల నివారణను ఒక విధిగా పరిగణించాలని చట్టంలో స్పష్టం చేయనున్నారు.

స్థల యజమాని లేదా ఆ పరిసరాల్లో నివాసం ఉంటున్న వారు తప్పనిసరిగా చేయాల్సిన పనులు.
► నీటితో ఉన్న ఖాళీ డబ్బాలు, బాటిళ్లు, కొబ్బరి బొండాలు, టైర్లు తదితర వాటిల్లో దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి.. పరిసరాల్లో అలాంటి వాటిని తొలగించాలి.
► నీరు సాఫీగా పోయేందుకు డ్రైనేజీ పైపుల్లో ఆటంకాలు లేకుండా చూడాలి. బావులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి.
► నివాస ప్రాంతాల్లో దోమల పెరగడానికి దోహదపడే కుళ్లిన కూరగాయలు, ఇతర చెత్త చెదారాలను తొలగించాలి.
► దోమల గుడ్లు పెరుగుదలకు ఎటువంటి పరిస్థితులున్నా అలాంటి వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.
► యజమానులకు నోటీసులిచ్చినా పట్టించుకోని సమయంలో.. అథారిటీ దోమల నివారణ చర్యలు చేపట్టి అందకయ్యే వ్యయాన్ని ఆయా వ్యక్తుల నుంచి వసూలు చేస్తుంది.
► డెంగీ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్‌ గానీ ప్రత్యేకంగా చికిత్స గానీ లేదని, ఈ నేపథ్యంలో వ్యాధి సోకకుండా ముందస్తు నివారణ చర్యలను చేపట్టడం ఒకటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది. డెంగీతో పాటు మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు తదితర వ్యాధుల నివారణకు దోమలను గుడ్లు దశలోనే నిర్మూలించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement