‘సొమ్ము’సిల్లే ఆలోచన! | New Aadhaar Cards Creation For Pension Eligibility | Sakshi
Sakshi News home page

‘సొమ్ము’సిల్లే ఆలోచన!

Sep 19 2019 8:18 AM | Updated on Sep 19 2019 8:24 AM

New Aadhaar Cards Creation For Pension Eligibility - Sakshi

అప్పటి వరకు యాభై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు అరవై ఐదేళ్ల వృద్ధుడు అయిపోయాడు. నలభై ఐదేళ్ల చలాకీ మనిషి ఆధారం లేని ముసలి వ్యక్తిగా మారిపోయాడు. ఒక్క రోజులోనే పది, పదిహేనేళ్ల వయసు పెంచేసుకున్నారు. పింఛన్‌ డబ్బులు పెరిగాక.. ఆ సొమ్ము అందుకోవాలన్న ఆశతో జిల్లాలో చాలా మంది ఇలా ముసలివాళ్లయిపోయారు. మీ సేవ కేంద్రాల సాయంతో తమ వయసు పెంచుకుని పింఛన్‌కు అర్హులైపోయారు. పింఛన్‌ అర్హుల జాబితా పెరగడంతో అధికారులు కాస్త నిశితంగా పరిశీలించగా విషయం వెలుగు చూసింది. నెలనెలా దాదాపు రూ.4కోట్లు అనర్హుల ఖాతాల్లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పింఛన్లు పెంచుతారన్న గోల. ఇంకేమంది కొంతమంది పక్కదారి పట్టారు. భారీగా పెంచే పింఛన్లు కొట్టేయడానికి అప్పటికప్పుడు వయసు పెంచేసుకున్నారు. వయ స్సు ధ్రువీకరణలో ట్యాంపరింగ్‌కు పాల్ప డ్డారు. ఇందుకు మీసేవ కేంద్రాలు సాయం చేశాయి. కాసులకు కక్కుర్తిపడిన నిర్వాహకులు ఇష్టారీతిన వయస్సు వేసేసి కొత్త ఆధార్‌ కార్డులు వచ్చేలా చేశారు. దీంతో 45 ఏళ్లు, 50 ఏళ్లు ఉన్న వారు కూడా 65 ఏళ్ల వయస్సు ఉన్నట్టుగా మార్చుకుని ఎన్నికల ముందు పింఛన్లకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తు న ముడుపుల బాగోతం నడిచింది. ఒక్కో కార్డులో వయస్సు మార్చేందుకు రూ. 8వేల వరకు కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేసి భారీగా లబ్ధిపొందారు. జిల్లాలో 20వేలకు పైగా ఈ రకంగా పింఛన్లు పొందినట్టు తెలిసింది. ప్రతి నెలా రూ. 4కోట్ల వరకు అనర్హులకు వెళ్తున్నట్టు సమాచారం.

 పింఛను కోసం వయస్సు మార్పు.. 
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పటికే పింఛను రూ. 2వేలకు పెంచుతానని ప్రకటించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాలుగున్నరేళ్లకు పైగా పింఛన్ల పెంపు జోలికెళ్లలేదు. ఈ లోగా ఎన్నికలొచ్చేశాయి. ఇంకేముంది ఓటర్లను ఆకట్టుకునేందుకు పింఛన్ల పెంపునకు అప్పటి సర్కారు సిద్ధమైంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పింఛన్ల పెంపుపై స్పష్టమైన ప్రకటనలు చేయడంతో కొందరికి ఆశ పెరిగింది. రూ. 2వేల పింఛన్‌ను ఎందుకు వ దులుకోవాలని అర్హత లేని వారు కూడా వాటి కోసం ఆరాటపడ్డారు.  45 ఏళ్లు, 50 ఏళ్ల వయస్సులో ఉన్న వారు కూడా  పింఛనుపై దృష్టి పెట్టారు. ఒక్కసారి వస్తే జీవితాంతం వరకు ఉంటుందని, ఆర్థికంగా భరోసా ఉన్నట్టు అవుతుందని ఏకంగా వయస్సు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఉన్న ఆధార్‌ కార్డులలో ఉన్న వయస్సైతే పింఛన్‌ కోసం సరిపోదని, యుద్ధ ప్రాతిపదికన వయస్సు మార్పు చేసుకున్నారు. 65 ఏళ్ల వయస్సు పైబడినట్టుగా చాలా మంది ఆధార్‌ కార్డులో వయస్సు మార్పు చేయించుకున్నారు.


‘మీ సేవ’లో.. 
ఇదే సమయంలో కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా అత్యాశకు పోయిన వారికి సహకరించారు. చెప్పాలంటే వయస్సు మార్చి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు. సాధారణంగా ఏదైనా ధ్రువీకరణ పత్రం చూసి ఆధార్‌ కార్డులో వయస్సు మార్చేందుకు ఆప్‌లోడ్‌ చేయాలి. కానీ పలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పులు చేసి అప్‌లోడ్‌ చేసేశారు. అప్‌లోడ్‌ అయ్యాక వయస్సు మార్పుతో కూడిన ఆధార్‌ కార్డులు జారీ అయిపోయాయి. వీటిని పట్టుకుని డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్ద ఎత్తున కొత్త పింఛన్లు పొందారు. జిల్లాలో ఈ రకంగా పింఛన్లు పొందిన వారు 20వేల వరకు ఉన్నారు.

 రాజాం, చీపరుపల్లి, పర్లాకిమిడి కేంద్రంగా..
ఈ రకమైన అక్రమ బాగోతానికి రాజాం, చీపురుపల్లి, పర్లాకిమిడి, బరంపురం కేంద్రంగా ఆధార్‌ కార్డుల వయస్సు మార్పులు జరిగినట్టు తెలిసింది. జిల్లా నలుమూలల నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లి వయస్సు మార్పులు చేయించినట్టు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. వయస్సు మార్చేందుకు ఒక్కో కార్డుకు రూ. 8వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. నెలకి రూ. 2వేలు వచ్చే పింఛన్‌కు ఒకేసారి రూ. 8వేలు ఖర్చు పెడితే జీవితకాలం వస్తుందని, ఆ వచ్చినదాంట్లో ఇది ఏ మాత్రమని చాలా మంది అడిగినంత ఇచ్చి ఆధార్‌ కార్డులు మార్పులు చేసుకున్నారు. 

ఫిర్యాదులొస్తున్నాయి.. 
ఆధార్‌ కార్డులో వయస్సు మా ర్చుకుని కొత్త పింఛన్లు పొందినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మార్పులు జరిగినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. కొన్ని మీసేవ కేంద్రాల ద్వారా ఈ మార్పులు జరిగినట్టు సమాచారం. వాటిని పరిశీలిస్తున్నాం. తప్పుడు ధ్రువీకరణ వయస్సుతో పింఛన్లు పొందిన వారిని ఏరివేయనున్నాం. దానికి సంబంధించి టెక్నికల్‌ సపోర్టు తీసుకుంటున్నాం. అనర్హులై పింఛన్లు పొందినట్టు నిర్ధారణ అయిన వెంటనే రద్దు చేస్తాం. 
– కల్యాణచక్రవర్తి,  ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఎ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement