గిరిజన సహకార సంస్థ ప్రకృతి సహజసిద్దమైన మారేడుగడ్డల వేర్ల నుంచి తయారు చేసిన నన్నారి షర్బత్ శుక్రవారం ఏపీ మార్కెట్‌లోకి విడుదలైంది.
విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ ప్రకృతి సహజసిద్దమైన మారేడు గడ్డల వేర్ల నుంచి తయారు చేసిన నన్నారి షర్బత్ శుక్రవారం ఏపీ మార్కెట్‌లోకి విడుదలైంది. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఆయుర్వేద గుణాలున్న ఈ పానీయాన్ని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు శుక్రవారం విశాఖపట్నం జీసీసీ కార్యాలయంలో మార్కెట్‌లోకి విడుదల చేశారు. అనంతరం ఈ ఉత్పత్తి విశిష్టతలను మంత్రి రావెల మీడియాకు వివరించారు.
చెంచు, యానాది తెగల వద్ద కిలోకి రూ.130 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్న జీసీసీ.. తొలిసారిగా వీటితో షర్బత్‌ను తయారు చేసి నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చిత్తూరు తేనెశుద్ధి కర్మాగార సముదాయంలో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌లో రోజుకు వెయ్యి బాటిళ్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 50 వేల బాటిళ్ల వరకు ఉత్పత్తి చేయాలని సంకల్పించింది.
ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న శీతల పానీయాల కంటే ఈ షర్బత్ ఎంతో ఆరోగ్యదాయకమని మంత్రి పేర్కొన్నారు. 750 ఎంఎల్ సామర్థ్యం గల ఒక బాటిల్‌ను నీటిలో కలిపితే సుమారు 100 గ్లాసుల వరకు సరఫరా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. కార్యక్రమంలో జీసీసీ వీసీఎండీ ఎస్‌పిఎస్ రవి ప్రకాష్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.