టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ దుయ్యబట్టారు.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ దుయ్యబట్టారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు మంద కృష్ణ తహతహలాడుతున్నారని... అందులో భాగంగానే తమ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బాబు మొరగమంటే ఓ బొచ్చుకుక్కలా మొరుగుతున్న మంద కృష్ణను మాదిగలే తరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. న్యాయస్థానాల్లో కేసు తేలకముందే యావజ్జీవ లేదా మరణశిక్ష వేయాలంటూ మందకృష్ణ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. చంద్రబాబు మాదిగలను వంచించి, మభ్యపెట్టగా,దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే రాష్ట్రంలో మాదిగలకు సంపూర్ణమైన న్యాయం చేశారని చెప్పారు.రాష్ట్రంలోని రిజర్వుడు పార్లమెంటరీ స్థానాల్లో మాల, మాదిగలకు సమన్యాయం చేశారని, అలాగే, లోక్‌సభ,శాసనసభ ఎన్నికల్లో జనరల్ స్థానాలను కూడా మాదిగలకు కేటాయించిన ఘనత రాజశేఖరరెడ్డిదన్నారు.