
చంద్రబాబు వల్లే నా భర్త హత్య
నా భర్త మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం.
బెల్టుషాపులతో దారుణం
ఏలూరు (సెంట్రల్) : నా భర్త మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. విచ్చలవిడిగా బెల్టుషాపులకు అనుమతివ్వడం వల్ల చాలామంది మద్యానికి బానిసలై కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. దారుణాలకు తెగబడుతున్నారు. నా భర్తను ఆయన స్నేహితులే మద్యం మత్తులో హతమార్చారు. అంటూ తూము శ్రీనివాసరావు భార్య తూము నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో సోమవారం డీసీసీబీ బ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) డీసీసీబీ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అదే సమావేశంలో శ్రీనివాస్ భార్య నాగలక్ష్మి బోరున విలపిస్తూ తన ఆక్రందనను వినిపించారు. బెల్ట్‌షాపులను నివారించలేని సీఎం చంద్రబాబే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ మహిళకూ ఈ దుస్థితి రాకూడదని, వెంటనే బెల్టుషాపులను నివారించాలని కోరారు. కాళ్ల గ్రామంలోని పెట్రోల్ బంకు వద్ద ఏర్పాటు చేసిన బెల్టుషాపు వల్లే తన భర్త చనిపోయాడని, తన భర్త మృతిపై సీబీసీఐడీతో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ అధికారులు మాట వింటేగా : ముత్యాల రత్నం
ఎక్సైజ్ అధికారుల వల్లే బెల్టుషాపులు పేరుకుపోతున్నాయని డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) విమర్శించారు. బెల్టుషాపుల్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయని, అవి ఘాతుకాలకు దారితీస్తున్నాయని, కాళ్ల గ్రామంలో తూము శ్రీనివాసరావు హత్య హేయమని పేర్కొన్నారు. గుడి, బడి తేడా లేకుండా బెల్టుషాపులు పుట్టుకొస్తున్నాయని వివరించారు. తూము శ్రీనివాసరావు భార్య నాగలక్ష్మికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కలెక్టర్ భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.