వైశాల్యంలో అనంతపురం జిల్లా పెద్దదని, సరిహద్దు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకొని రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు.
పెద్దపప్పూరు, న్యూస్‌లైన్ : వైశాల్యంలో అనంతపురం జిల్లా పెద్దదని, సరిహద్దు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకొని రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక్క రోజు తానే ఏదో ఒక మండల కేంద్రానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. శనివారం పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ముచ్చుకోట పోలీస్‌స్టేషన్‌లో ప్రజల చెంతకే పోలీసులు అనే నినాదంతో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చాలా చిన్న సమస్యలు కూడా పరిష్కరించకపోతే అవి జఠిలంగా మారే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ హెల్ప్‌లైన్-100కి రోజూ దాదాపు 70 వరకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి ఫ్యాక్షనిస్టులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే చోట బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, బుక్కరాయసముద్రం, పామిడి మండలాలకు చెందిన 100 మందికి పైగా అర్జీలు ఇచ్చారు. రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువ అర్జీలు రావడం విశేషం. ప్రజలు ఇచ్చిన అర్జీలను తహశీల్దార్ రమాదేవికి అప్పజెప్పారు. మరికొన్నింటిని సంబంధిత మండలాల ఎస్‌ఐలకు అప్పగించి, విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, డీఎస్పీ నాగరాజు, సీఐలు లక్ష్మీనారాయణ, రాఘవన్, తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యల్లనూరు, పామిడి, పుట్లూరు ఎస్‌ఐలు పాల్గొన్నారు.