నా జీవితంలో సినిమాలు చూడలేదు

నా జీవితంలో సినిమాలు చూడలేదు


ఆయన వయస్సు ఇంగ్లిష్ కేలెండర్ ప్రకారం వంద సంవత్సరాలు దాటింది. తెలుగు తిధుల ప్రకారం, అధిక మాసాలతో కలుపుకుంటే, మరింత ఎక్కువే ఉంటుంది. అయితే, నేటికీ ఆయన కళ్లజోడు ధరించరు. చేతి కర్ర ఉపయోగించకపోవడమే కాదు, నడిచేటప్పుడు ఎవరినీ ఆయన్ను పట్టుకోనివ్వరు. వినికిడి శక్తి తగ్గలేదు.


 


అంతేకాదు, బీపీ, షుగరు వంటి వ్యాధులు అంటే ఏమిటో ఆయనకు తెలీదు.. నేటికీ తన పనులను తానే స్వయంగా చేసుకుంటున్న మారెళ్ళపూడి సూర్యనారాయణ సాగర సంగ మహేశ్వర శర్మ ఈ జిల్లా పొలిమేరలు దాటి వె ళ్లిన సంఘటనలు చాలా అరుదు. శనివారం సాయంత్రం ఆనం కళాకేంద్రంలో శ్రీహరి సంగీత విభావరి ఆధ్వర్యంలో జరుగనున్న ‘గురుర్దేవో భవ’ సంగీత విభావరి కార్యక్రమంలో సన్మానం అందుకోవడానికి నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన తన జీవన సరళిని, జీవశక్తిని ఇలా వివరించారు...

 

 దేవీచౌక్ (రాజమండ్రి) :మాది  సామర్లకోట మండలం, జి.మేడపాడు గ్రామం. నేను 1914 జూలై ఏడవ తేదీన తునిలో మాతామహుల ఇంట జన్మించాను. తండ్రి కలికిమూర్తి జి.మేడపాడులో పౌరోహిత్యం చేసేవారు. నా పేరులో సూర్యనారాయణ పేరు ఉండడంతో, నన్ను ఇంట్లో అందరూ భానుమూర్తి అని ముద్దుగా పిలిచేవారు. తునిలో ఎస్సెల్సీ వరకూ చదివాను. రాజమండ్రిలో ఆర్ట్సు కళాశాల చరిత్ర ఉపన్యాసకుడు రాళ్లబండి సుబ్బారావు సౌజన్యంతో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రెయినింగ్ పూర్తిచేశాను. ఆయనే వరదరావు హోటల్లో నాకు భోజనం ఏర్పాటు చేశారు. జి.మేడపాడు, సామర్లకోట, అమలాపురం, జగ్గంపేట, బిక్కవోలు, వేట్లపాలెం, తాళ్లరేవు ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా పనిచేశాను. 1971లో బిక్కవోలులో పదవీ విరమణ చేశాను. నాకు ఇద్దరు కుమారులు, ఒక మనుమడు, ముగ్గురు మనుమరాళ్లు, ముగ్గురు మునిమనుమలు, నలుగురు మునిమనుమరాళ్లు.

 

 ఆరోగ్య రహస్యాలు

 నాకు ఉదయం 9 గంటలకు భోజనం చేయడం అలవాటు. మళ్లీ రాత్రి భోజనం చేస్తాను. మధ్యలో చిరుతిళ్లు ఉండవు. కాఫీ, టీ అలవాటు లేవు. రాత్రి పదింటికి పడుకొని ఉదయం అయిదు గంటలకు మేలుకుంటాను. లేవగానే కొద్దిపాటి వ్యాయామం, దైవధ్యానం చేస్తాను. సంధ్యావందనం, ఆదిత్య హృదయం నేటికీ చేస్తున్నాను. సాయంత్రం విష్ణుసహస్రనామం పారాయణ చేస్తున్నాను. నా జీవితంలో సినిమాలు చూడలేదు. టీవీలంటే నాకు అసహ్యం. వార్తలు వినడానికే టీవీ చూస్తాను. నాకు సైకిల్ ఉండేది. సాత్విక ఆహారంతో శరీరం, మనస్సూ రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన బుద్ధులు ఉంటాయి.

 

 నాడు - నేడు

 నేను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మద్దూరి అన్నపూర్ణయ్య, క్రొవ్విడి లింగరాజు, ప్రకాశం పంతులు వంటి వారిని చూశాను. నాడు చదువుల్లో నైతిక విలువలకు పెద్దపీట వేసేవారు. నేడు అది శూన్యం. నేను 1955 నుంచి హిందూ ధర్మప్రచార కార్యక్రమాన్ని చేపట్టి, శిష్యుల సాయంతో 26 పుస్తకాలను ముద్రించగలిగా. నా వందో పుట్టినరోజున కైవల్యసుధ అనే గ్రంథాన్ని విడుదల చేశాను. ఎన్నో సన్మానాలు అందుకున్నాను. నాకు కోరికలు ఏమీ లేవు. ఆ భగవంతునిలో లీనమయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top