కదిలితే ఒట్టు! | Moves scum! | Sakshi
Sakshi News home page

కదిలితే ఒట్టు!

Aug 23 2014 1:11 AM | Updated on Nov 9 2018 5:52 PM

కదిలితే ఒట్టు! - Sakshi

కదిలితే ఒట్టు!

రాష్ట్ర తాత్కాలిక రాజధాని, వాణిజ్య కూడలి విజయవాడ కేంద్రంగా కొలువుల కోసం వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది ఎవరిస్థాయిలో వారు చక్రం తిప్పుతున్నారు.

  • వాణిజ్యపన్నుల శాఖలో బదిలీల తంతు
  •  ఫోకల్ పోస్టింగ్‌ల కోసం పైరవీలు
  •  ఏళ్ల తరబడి కదలని అధికారులు
  •  పదోన్నతుల పోస్టింగ్‌లోనూ నిబంధనలకు నీళ్లు  
  • విజయవాడ : రాష్ట్ర తాత్కాలిక రాజధాని, వాణిజ్య కూడలి  విజయవాడ కేంద్రంగా కొలువుల కోసం  వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది ఎవరిస్థాయిలో వారు చక్రం తిప్పుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా అక్రమ ఆదాయం వచ్చిపడే వాణిజ్యపన్నుల శాఖలో కుర్చీల కోసం పైరవీలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో హడావుడి మొదలైంది. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులకు జోనల్‌స్థాయి బదిలీలు జరగాల్సి ఉండగా...  ప్రతీ ఏటా ఒకే కార్యాలయంలో కుండమార్పిడీల రీతిలో అక్కడికక్కడే సర్దుకుంటున్నారు.

    డీసీటీవో, సీటీవోస్థాయి అధికారులు రెండేళ్లకోసారి, కనీసం మూడేళ్లకోసారైనా బదిలీ అవాల్సి  ఉంది. ఏలూరు, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు గెజిటెడ్ అధికారులు బదిలీ కావల్సి ఉండగా ఎవరికి కావాల్సింది వారికి ముట్టజెప్పి విజయవాడను  వదలడం లేదని చెబుతున్నారు.  రికార్డు అసిస్టెంట్ నుంచి డీసీటీవో క్యాడర్ వరకు విజయవాడలో  ఒకే కార్యాలయంలో పనిచేసే వారు పలువురు తాజాగా మళ్లీ ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

    ఎన్నోఏళ్లుగా తిష్టవేసిన కొందరు అధికారులు ఆ సీట్లను వదలకపోవటంతో, నగరానికి బయట పని చేసే వారు అక్కడే మగ్గిపోతున్నామని వాపోతున్నారు.   జిల్లా వ్యాప్తంగా విజయవాడలో 1డివిజన్, 2వడివిజన్లతోపాటు 16 సర్కిళ్లు ఉన్నాయి. ఎనిమిది సర్కిళ్లకు 16మంది  డీసీటీవోలు, 48 మంది సీటీవోలు (ఇన్‌స్పెక్టర్లు)పనిచేస్తుంటారు.   జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు దాదాపు మరో140 మంది ఉన్నారు.   వీరంతా తమ పలుకుబడితో విజయవాడ వదిలి వెళ్లకుండా  ఉంటున్నారు.  
     
    పదోన్నతుల పోస్టింగ్‌లోనూ నిబంధనలకు నీళ్లు ...
     
    రెండు రోజుల క్రితం వాణిజ్యపన్నుల శాఖలో 1, 2,డివిజన్ కార్యాలయాల్లో పని చేసే  20 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంటెంట్లుగా పదోన్నతి  వచ్చింది. నిబంధనల ప్రకారం ఒక సర్కిల్‌లో పనిచేసిన వ్యక్తిని తిరిగి అదే డివిజన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించటానికి నిబంధనలు ఒప్పుకోవు.అయితే సంబంధిత అధికారులు ఆ నిబంధనలు గాలికి వదిలి  పలువురిని గతంలో పనిచేసిన సర్కిల్‌లోనే పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement