ఏపీలోనే ఎక్కువ ఎన్నికల వ్యయం

Most electoral expenditure in the AP says Gopalakrishna Dwivedi - Sakshi

ఎంసీఎంసీ వర్క్‌షాపులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది

ఎక్స్‌పెండిచర్‌ సెన్సిటివ్‌ స్టేట్‌గా ప్రకటించిన ఈసీ

మద్యం, బహుమతులు, పెయిడ్‌ ఆర్టికల్స్‌ ప్రధాన సమస్య

జిల్లాస్థాయిల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

పెయిడ్‌ ఆర్టికల్స్‌ నిర్ధారణలో ఎంసీఎంసీలదే కీలకపాత్ర

ఇప్పుడున్న కమిటీలతో పరిశీలన కష్టతరం..

అదనంగా సహాయకులను తీసుకోవాలి

జిల్లా స్థాయిలో పటిష్టమైన కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసుకోవాలి

అక్రమ ఓట్ల తొలగింపు దరఖాస్తులు తగ్గాయి

ఇప్పటికే పలుచోట్ల క్రిమినల్‌ కేసులు నమోదు

సాక్షి, అమరావతి: దేశంలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక ఎన్నికల వ్యయం ఆంధ్రప్రదేశ్‌లో జరుగనుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీని ఎక్స్‌పెండిచర్‌ సెన్సిటివ్‌ స్టేట్‌(ధన వ్యయపరంగా సున్నితమైన రాష్ట్రం)గా ప్రకటించడమే కాకుండా అత్యధిక పరిశీలకులను రాష్ట్రానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మద్యం, బహుమతుల పంపిణీతోపాటు పెయిడ్‌ ఆర్టికల్స్‌ అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా గుర్తించారని, దీనిపై జిల్లా స్థాయిల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ద్వివేది హెచ్చరించారు. సున్నితమైన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున పెయిడ్‌ ఆర్టికల్స్‌ను గుర్తించడానికి మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ ఇంతవరకు ఎంసీఎంసీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో 13 జిల్లాల ఎంసీఎంసీ నోడల్‌ ఆఫీసర్లు, వివిధ మీడియా ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇందులో ద్వివేది మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెయిడ్‌ ఆర్టికల్స్, సోషల్‌ మీడియా అనేవి అత్యంత కీలకమైన అంశాలని, పార్టీలకతీతంగా వీటిని గుర్తించి అభ్యర్థుల వ్యయంలో చేర్చాల్సిన బాధ్యత ఎంసీఎంసీదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదారుగురు సభ్యులతో ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేశారని, వీరితో పరిశీలన చేయడం కష్టమని, వీరికి అదనంగా కనీసం 15–20 మంది సహాయకులను తీసుకుని జిల్లా స్థాయిలో పటిష్టమైన కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే కేంద్ర ఎన్నికల పరిశీలకులు వస్తారు కాబట్టి ఈలోగానే మొత్తం ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కలెక్టర్లను ఆయన కోరారు.

వీవీప్యాట్‌లతో ఎన్నికలు
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎంలు)ను వినియోగించడం 30 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ వాటి పనితీరుపైన కొందరు అపోహలు కల్పిస్తూనే ఉన్నారని, ప్రజల్లోనూ, పార్టీల్లోనూ ఉండే ఈ భయాందోళనలను తొలగించడానికి రాష్ట్రంలో తొలిసారిగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ద్వివేది తెలిపారు. వీవీ ప్యాట్‌లలో ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటేశారో తెలుపుతూ ఏడు సెకన్లపాటు కనిపిస్తుందన్నారు. ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయవచ్చనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

తగ్గుతున్న అక్రమ ఓట్ల తొలగింపు దరఖాస్తులు..
రాష్ట్రంలో గంపగుత్తగా వస్తున్న ఓట్ల తొలగింపు దరఖాస్తులు గత రెండు రోజుల నుంచి తగ్గినట్లు ద్వివేది తెలిపారు. ఓటరు ప్రమేయం లేకుండా ఇలా అక్రమంగా ఫారం–7తో ఓట్లు తొలగించమంటూ దరఖాస్తు చేయడం క్రిమినల్‌ చర్య అని, దీనిపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో ఇలా 2,300 ఓట్లు తొలగింపునకు దరఖాస్తు వచ్చినట్లు తేలిందన్నారు. ఈ సమస్య కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలపైనే ఉందని, వాటిపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఇలా దరఖాస్తు చేసిన ఓటర్లను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటున్నామని, అందువల్ల ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శుక్రవారం ఒక్కరోజే విశాఖలో 40,000, గుంటూరులో 50,000 దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఎన్ని అక్రమ ఓట్ల తొలగింపునకు, చేర్పించడానికి దరఖాస్తులు వచ్చాయో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top