వాస్తవాలు చెప్పడం అందరి బాధ్యత: మోహన్‌బాబు

Mohan Babu Reaction Over Attack On YS Jagan - Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న మనిషిగా ఈ ఘటనపై స్పందిస్తున్నట్టు తెలిపారు. ప్రజల మేలు కోరి 12 జిల్లాలు తిరిగి.. ఇంకా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్న ఓ నాయకుడికి ఇలా జరగడం బాధకరమని అన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని అన్నారు. పెన్ను కూడా తీసుకువెళ్లలేని ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా తీసుకెళ్లారు అని ప్రశ్నించారు. కత్తి తీసుకెళ్లమని నిందితుడిని ప్రోత్సహించిన వారెవరో తేలాలని అన్నారు. 

మరోవైపు వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిపై టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. పోటీ మనస్తత్వం ఉండాలని.. అభిమాని పేరుతో ఎవరు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడరని పేర్కొన్నారు. ఐదు నిమిషాల్లో ఎటువంటి పోస్టర్లయినా తయారు చేయవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అందరి బాధ్యత అని సూచించారు. వైఎస్‌ జగన్‌పై దాడి కలలో కూడా ఊహించని ఘటన అని తెలిపారు. ఆయనపై జరిగిన దాడి తప్పని చాలామంది టీడీపీ మిత్రులు ఫోన్‌ చేసి చెప్పారని వెల్లడించారు. ధర్నాలు, ఆందోళనలు, బస్సులపై దాడి చేయడం వైఎస్‌ జగన్‌కు ఇష్టం ఉండదని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని తన అభిమానులకు చెప్పినట్టు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top