పోలవరం నిర్వాసితులకు మోడల్‌ కాలనీలు: సీఎం

Model Colonies for Polavaram expats say Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. మోడల్‌ కాలనీలు నిర్మించి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలన్నారు. నిర్వాసితుల స్థితిగతులు, వ్యక్తిగత సమాచారంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిర్వాసితుల జీవన ప్రమాణాలను పెంచేలా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, పునరావాస పరిహారం కింద మరింత సాయానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. లక్ష కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, మౌలిక వసతులు కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన 68వ సారి వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికి 56.69 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

ప్రాజెక్టు పనుల్లో 45 డిజైన్లకుగాను 14 డిజైన్లు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం పొందగా, మరో 22 పెండింగ్‌ ఉన్నాయని, మరో 9 డిజైన్లు ఏజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. డిజైన్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరగా ఆమోదం పొందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎం కార్యదర్శి రాజమౌళి, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  

కృష్ణా డెల్టాకు తొలిసారిగా జూన్‌లో నీళ్లిచ్చాం: బాబు
కృష్ణా డెల్టా 150 ఏళ్ల చరిత్రలో జూన్‌లో ఆయకట్టుకు నీళ్లి వ్వడం, పంటలు సాగు చేయడం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు  అన్నారు. సోమవారం సచివాలయంలో నీరు– ప్రగతి, వ్యవసాయంపై ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశధార, నాగావళికి వరద ప్రవాహం పెరిగిందన్నారు. మరో 10 రోజుల్లో శ్రీశైలం రిజర్వా యర్‌ నిండుతుందన్నారు. మంగళవారం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాయలసీమకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్‌లో సోమవారం పలువురు యానిమేటర్లు సీఎంను కలసి తమకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ నెలకు రూ. 3 వేలు గౌరవ వేతనం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. 

చేనేతలకు ‘ముద్ర’రుణాలపై సీఎం సమీక్ష 
చేనేత కార్మికులకు కేంద్రం ద్వారా ఇస్తున్న ‘ముద్ర’రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గతేడాది 10,209 మంది చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా ముద్ర పథకం కింద రూ. 52.27 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top