గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..

MLA grandhi srinivas fires On TDP In Bhimavaram - Sakshi

సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం పట్టణంలోని మంచినీటి సమస్యకు గత పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం, అవగాహన లోపమే కారణమని స్ధానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఎక్కువ నీరు, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు తక్కువ నీరు పంపిణీ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేశారని ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.అమరయ్యతో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

గత పదేళ్లుగా మున్సిపాల్టీని పాలిస్తున్న టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే కూడా మంచినీటి సమస్యపై దృష్టిపెట్టలేదని  విమర్శించారు. పదేళ్లుగా పట్టణ జనాభాతోపాటు పట్టణానికి వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజల సంఖ్య పెరిగినా ఆ మేరకు నీటి సరఫరా చేయడానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదన్నారు. మంచినీటి సరఫరా కోసం కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం నిధులు మంజూరు చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత పాలకులు విఫలమయ్యారని శ్రీనివాస్‌ దుయ్యబట్టారు.  అమృత పథకంలో పైపులైన్లు వేయాల్సివుంటుందని తెలిసిన ప్రాంతాల్లో సైతం సిమెంట్‌ రోడ్డు నిర్మించి ఆ తరువాత వాటిని «పగులగొట్టి మంచినీటి పైపులైను వేయడం మున్సిపల్‌ పాలకుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. 

సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఒక పక్క పట్టణ శివారు ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందక ఇక్కట్లు పడుతుంటే  ఎలాంటి ఆలోచన లేకుండా కొత్తగా 1,500 కుళాయి కలెక్షన్లు కొత్తగా ఇచ్చి మరింత ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.  పట్టణం మొత్తం మీద వన్‌టౌన్, త్రీటౌన్‌ ప్రాంతంలో సుమారు లక్షా 65 వేల మంది జనాభా ఉండగా వారికి నాలుగు ఓహెచ్‌ఆర్‌ ద్వారా కేవలం 53 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంటే కేవలం 32 వేల మంది జనాభా ఉన్న రెండో పట్టణ పరిధిలో రెండు ఓహెచ్‌ఆర్‌ల ద్వారా ఏకంగా 31 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం విచిత్రంగా ఉందన్నారు. వన్‌టౌన్‌ పరిధిలోని ఓహెచ్‌ఆర్‌ల ద్వారా పంపిణీ చేసే 53 లక్షల లీటర్ల నీటిలో  10 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని వివరించారు. పట్టణానికి అవసరమైన సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌తోపాటు మరో మంచినీటి చెరువు ఉన్నా నీటి సరఫరా చేయడానికి అవసరమైన ఓహెచ్‌ఆర్‌లు, పైపులైనులు లేవని, వీటిని నూతనంగా ఏర్పాటుచేయడానికి గత పాలకులు ఎలాంటి కృషిచేయలేదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ విమర్శించారు.  

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రధానంగా మంచినీటి సమస్యపైనే దృష్టిసారించానని దానిలో భాగంగా మున్సిపల్‌ కమిషనర్, మునిసిపల్‌ ఇంజనీర్లతో సమీక్షించినట్లు చెప్పారు. పట్టణ ప్రజల అవసరాలకు కోటి 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సివుండగా పైపులైన్లు అస్తవ్యస్థంగా ఉండడం, సరిపడా ఓహెచ్‌ఆర్‌లు లేకపోవడం వల్ల కేవలం 85 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. పట్టణానికి మరో మూడు ఓహెచ్‌ఆర్‌లు అవసరమవుతాయని అమృత్‌ పథకంలో దుర్గాపురంలో నిర్మాణం చేపట్టారని, మరో రెండు ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సివుందన్నారు. మంచినీటి సమస్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తాగునీటి కష్టాలు వచ్చినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉంటేనే తాను సంతోషంగా ఉంటానని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. 

డ్రయిన్లలో పూడికతీతలోను అలసత్వమే....
మున్సిపల్‌ పాలకులు పట్టించుకోకపోవడంతో పట్టణంలోని డ్రయిన్లలో పూడికతీత పనులు జూన్, జూలైలో చేపడుతున్నారని శ్రీనివాస్‌ విమర్శించారు. పూడిక మట్టి వర్షాల కారణంగా తిరిగి డ్రయిన్లలోకి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top