ఓరుగల్లు వేయి స్తంభాల గుడిలో అద్భుతం | Miracle in Orugallu Thousand Pillar Temple | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు వేయి స్తంభాల గుడిలో అద్భుతం

Sep 14 2013 3:10 AM | Updated on Sep 1 2017 10:41 PM

కాకతీయుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఓరుగల్లు వేయి స్తంభాల ఆలయంలో కల్యాణ మంటపాన్ని పునర్నిర్మించే పనులు వేగం పుంజుకున్నాయి.

తొలగించిన రాళ్లతో కొత్త కట్టడం
మార్చికల్లా కల్యాణ మండపం పూర్తి

 
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఓరుగల్లు వేయి స్తంభాల ఆలయంలో కల్యాణ మంటపాన్ని పునర్నిర్మించే పనులు వేగం పుంజుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా... ఏడేళ్ల కిందట తొలగించిన ఓ కట్టడం రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తూ పునర్నిర్మించేందుకు 50 మంది శిల్పులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 

కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి ప్రతీకగా  132 రాతి స్తంభాలుండే ఈ ప్రాంగణాన్ని క్రీస్తు శకం 1163లో రుద్రదేవుడు 850 ఏళ్ల క్రితం నిర్మించాడు.  కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో పురావస్తుశాఖ పునర్నిర్మాణానికి సిద్ధపడగా, ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది. దీని పునాదుల్లో కాకతీయులు అనుసరించిన ‘స్యాండ్ బాక్స్ టెక్నాలజీ’ని అనుసరించినట్లు ఇంటాక్ ప్రతినిధి రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఎన్‌ఐటీ ఇంజనీర్లు తెలిపారు. మండపం అడుగున 3 మీటర్ల లోతు మట్టి తొలగించి ఇసుక నింపి గ్రానైట్, ఇటుక, కరక్కాయలు, బెల్లం మిశ్రమంతో క్యూరింగ్ చేశారు.
 
ఆ ఇసుక బేస్‌మెంట్‌పైనే రాళ్లను పేర్చుతున్నారు. భూకంపాలు వచ్చినా కట్టడం చెక్కు చెదరకుండా రాళ్లకు రాళ్లను పట్టి ఉంచేలా స్టెయిన్ లెస్ స్టీల్ పట్టీలు అమర్చుతున్నారు.  3000 శిలలు, గ్రానైట్ కళా ఖండాలు, రాతి స్తంభాలు పాత కట్టడం తొలగించినప్పుడు వెలికితీసి క్రమ పద్ధతిలో నంబర్లు వేసి భద్రపరిచారు. వీటిలో 41 స్తంభాలు పగిలి పోగా, శిల్పులతో మళ్లీ చెక్కించి, మండపాన్ని పునర్నిర్మిస్తున్నారు. 

బేస్‌మెంట్ నుంచి పది మీటర్ల ఎత్తు  నిర్మాణం పూర్తయింది. చుట్టూ ఉండే ప్రదక్షిణ పథానికి ఏడు వరుసల్లో రాళ్లు పేర్చి, 4 వరుసల్లో కక్షాసనం నిర్మించారు. రంగ మండపం పశ్చిమాన గ్రానైట్ శిలలను నిలబెట్టారు. 10 మీటర్ల ఎత్తు నిర్మాణంతో 60% పనులు పూర్తయ్యాయి.వచ్చే మార్చి నెలాఖరుకల్లా మండపం పూర్తవుతుందని స్తపతి శివకుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement