మతలబేందో! | minister sridhar babu meet to vijayaramana rao | Sakshi
Sakshi News home page

మతలబేందో!

Jan 8 2014 5:19 AM | Updated on Sep 2 2017 2:22 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య భేటీ అయ్యారు.

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని శ్రీధర్‌బాబు నివాసంలో ఆయనను కలుసుకొని, రెండు గంటలపాటు మంతనాలు జరిపారు. సాధారణ ఎన్నికలు సమీపించిన తరుణంలో, రాజకీయ సమీకరణాలు మారుతాయనే ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో భారీ మార్పులకు సంకే తంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
 
 మంత్రి పదవికి రాజీనామా చేసినందుకే శ్రీధర్‌బాబును కలిసారా.. లేక రాజకీయ మతలబు ఏదైనా ఉందా అనే కోణంలో టీడీపీ వర్గాలు కూడా ఆరాతీస్తున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలువగా, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ మారడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య ముగ్గురికి పడిపోయింది.
 
 మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్‌లోకి వెళుతారనే వాదన ఉంది. గతంలో పార్టీ మారేందుకు దేవయ్య తన నివాసంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కావడం తెలిసిందే. కార్యకర్తలు వ్యతిరేకించడంతో అప్పట్లో చేరికను విరమించుకున్న దేవయ్య ఆ తరువాత పార్టీ మారడాన్ని ఖండిస్తూ వచ్చారు. జిల్లాలో టీడీపీకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో విజయరమణారావు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్‌బాబుతో వీరిరువురు భేటీ కావడంతో మరోసారి పార్టీ మార్పు అంశం తెరపైకి వచ్చి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
 పార్టీని వీడేది లేదు : విజయరమణారావు
 తాను కరుడుగట్టిన టీడీపీ వాదినని, ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. మంగ ళవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వ్యక్తిగత పని నిమిత్తం తాను, దేవయ్య శ్రీధర్‌బాబును కలిశామే తప్ప రాజకీయంగా ప్రాధాన్యత లేదన్నారు. మంత్రి కాబట్టే శ్రీధర్‌బాబును కలిశామని, తమతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఉన్నారన్నారు. కచ్చితంగా బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందని, తమకు పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement