‘ఆ మంత్రి వల్ల టీడీపీ పది స్థానాలు ఓడిపోతుంది’

Minister Somireddy Wrong Allegations On Me Says Adala Prabhakar Reddy - Sakshi

సాక్షి, నెల్లూరు: తొలిసారి తాను 1999లో టీడీపీ అభ్యర్థిగా అల్లూరు నుంచి గెలిచి మంత్రి అయినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నామీద కడుపు మంటని వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమిరెడ్డిని ఈ జిల్లాలో నాలుగు సార్లు వరసగా ప్రజలు ఓడించినా.. చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రిని చేశారని అన్నారు. తాను టీడీపీలో ఉండడం, పదవులు చేపట్టడం సోమిరెడ్డికి ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే జాబితాలో ప్రభాకర్‌ రెడ్డికి స్థానం కల్పించినా.. ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. నెల్లూరు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకత్వంలో ఉన్న రాజకీయ దిగజారుడు అంశాలను ఆయన వివరించారు. సోమిరెడ్డి నిత్యం చంద్రబాబు  చెవిలో తనపై ఉన్నవి లేనివి చెప్పి అబద్ధాలు సృష్టించేవారిని ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!

‘‘టీడీపీలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, అవమానాలకు గురిచేసి నన్ను మోసం చేశారు. నేను పార్లమెంట్, లేకపోతే కోవూరు అసెంబ్లీ అడిగాను, కానీ కావాలని నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు. అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం పని చేస్తుంటే అడుగడుగనా అడ్డుకున్నారు. ఈ విషయాలను  చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని వెళ్తే సోమిరెడ్డి అడ్డువేసి నన్ను గంట వెయిటింగ్ చేయించారు. నన్ను పార్టీ నుంచి బయటకి పంపించాలని సోమిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జిల్లాలో ముఖ్య నాయకులను పార్టీ నుంచి పంపించడంలో సోమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. నేను రూరల్‌లో టీడీపీ నుంచి గెలిచే పరిస్థితుల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించడం సహించలేకపోయా. నేను బిల్లులు తీసుకుని పార్టీ మారారని ప్రచారం చేస్తున్నారు. బిల్లులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, రుజువు చేయకపోతే నువ్వు తప్పుకుంటావా. సోమిరెడ్డి వల్ల జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోనుంది. నాకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్ల బిల్లులు రావాలి, అవసరం అయితే కోర్టుకు వెళ్తా. నేను వచ్చాక ఆత్మకూరు, నెల్లూరు రూరల్ లో పార్టీని బలోపేతం చేశా, అనవసర ఆరోపణలు చేయడం తగదు. నన్ను కేసీఆర్ బెదిరించాడని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యాలు‘‘ అని అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top