ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

Minister Perni Nani Speech On AP Cabinet Important Decisions - Sakshi

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు

అమరావతి భూకుంభకోణంపై సీబీఐ, సీఐడీ లేదా లోకయుక్త విచారణ!

హైపవర్‌ కమిటీ సమీక్ష అనంతరం రాజధానిపై ప్రకటన

రైతులు ఆందోళన వద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్నినాని

సాక్షి, అమరావతి : రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లోకయుక్త, సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం, జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చ వంటి అంశాలపై శుక్రవారం సమావేశమైన మంత్రిమండలి నిర్ణయాలకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎ‍న్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎస్టీలకు 4 శాతం, ఎస్సీలకు 19.08, బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం ఈ మేరకు తీర్మానం చేశామని పేర్కొన్నారు. (జీఎన్‌ రావు కమిటీ నివేదికపై సూత్రపాయ చర్చ)

హైపవర్‌ కమిటీ సమీక్ష అనంతరం తుది నిర్ణయం
అలాగే రాజధానిపై జీఎన్‌రావు కమిటీ సమర్పించిన నివేదికపై కేబినెట్‌ చర్చించిందని, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి రాజధాని నిర్మాణం జరపాలా? లేక ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలా అనేదానిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. జీఎన్‌రావు కమిటీతో పాటు శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రిమండలి అధ్యయనం చేసిందన్నారు. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్‌ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. రాజధాని భూములపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాజధాని రైతులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని అన్నారు.

కలల రాజధాని ని‍ర్మించారు..
సమావేశంలో పేర్ని నాని వివరాలను వెల్లడిస్తూ.. ‘గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన అవినీతి, కుంభకోణాలుపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించింది. వాటిపై మంత్రి మండలి చర్చించింది. చంద్రబాబుకు వాటాలు ఉన్న ఓ కంపెనీ రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసింది. కొందరు మంత్రులు కూడా భూములు కొనుగోలు చేశారు. ఆస్తులు అక్రమంగా కొన్నవారు శిక్ష అనుభవించక తప్పదు. న్యాయనిపుణుల సలహా అనంతరం వీటిపై విచారణను ఆదేశిస్తాం. 2015లో అప్పటి ప్రభుత్వం ఊహాజనితమైన రాజధాని నిర్మించాలని కలలు కన్నది. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కుతూ.. మంత్రి నారాయణ ఇచ్చిన నివేదిక మాత్రమే పరిగణలోకి తీసుకుంది. 33 వేల ఎకరాల రైతుల భూములను, మరో ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూములను కలిపి మొత్తం 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక లక్షా పదివేల కోట్ల పైచిలుకు అంచనా వేశారు. కానీ ఐదేళ్ల కాలంలో కేవలం 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు’ అని అన్నారు.

పంటలకు గిట్టుబాటు ధర..
‘దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 108 అంబుల్సెన్స్‌ వాహనాలను గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భ్రష్టుపట్టించారు. వాటిని మరింత పటిష్టం చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. 412 కొత్త వాహనాలకు కొనుగోలు చేస్తాం. వాటి కోసం రూ.71 కోట్లు కేటాయించాం. అలాగే వైద్య సేవలు కోసం రూ. 60 కోట్లతో 656 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేస్తాం. కనీస మద్దతు ధరకు నోచుకోని, పసుపు, మిర్చి ఉల్లి, చిరుధాన్యాలు వంటి పంటలకు మద్దతు ధరలను ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా మంత్రిమండలి తీర్మానం చేసింది. కడప జిల్లా రాయచోటిలో నాలుగు ఎకరాల భూమిని వక్ప్‌ బోర్డుకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణం డీపీఆర్‌ తయారీకి రైట్స్‌ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వమే దీనిని సొంతగా నిర్మాణం చేయుటకు అనుమతులు మంజూరు చేశాం. రామాయపట్నం పోర్టుకు ముందడుగు పడింది. త్వరలోనే నిర్మాణం చేపడుతాం’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top