రూటు మార్చిన మైనింగ్‌ మాఫియా

Mining mafia changed the Route - Sakshi

     అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహంతో పల్నాడులో క్వారీలు మూయించిన అధికారులు

     ఇదే అదనుగా లీజుదారుల నుంచి క్వారీలను లాక్కుంటున్న ఎమ్మెల్యే నేతృత్వంలోని మాఫియా

     తన అనుచరుల చేతికి క్వారీలు రాగానే అనుమతులు వచ్చేలా పథక రచన

     తెల్లరాయిని రెట్టింపు ధరకు కొనుగోలు చేయాలంటూ మిల్లర్లకు హుకుం

     మైనింగ్‌ మాఫియాకు సహకరిస్తున్న అధికారులు

సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్‌ను ఆపేయాలంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలోని మైనింగ్‌ మాఫియా కొత్త రూటు ఎంచుకుంది. లీజుదారుల నుంచి నయానో భయానో క్వారీలను సొంతం చేసుకుని ఆ తర్వాత అనుమతులు రప్పించి కోట్లు కొల్లగొట్టడానికి అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలోని మాఫియా పథకం రచించింది. దీనికి ఓ మైనింగ్‌ అధికారి సహకారం కూడా ఉందని తెలుస్తోంది. ఈ అక్రమ దందాకు సంబంధించి ఆదివారం రాత్రి మైనింగ్‌ మాఫియాకు చెందిన ఓ ముఖ్యుని కోల్డ్‌ స్టోరేజీలో మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము చెప్పిన ధరకే తెల్లరాయి కొనాలని హుకుం జారీ చేశారు. మరోపక్క లీజుదారులను ఎక్కడ లేని నిబంధనలతో మైనింగ్‌ అధికారి బెంబేలెత్తించారు. క్వారీలన్నింటిని మాఫియాకు అప్పజెప్పేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. లీజుదారుల నుంచి మైనింగ్‌ మాఫియా చేతుల్లోకి క్వారీలు వెళ్లగానే నిబంధనలను సడలించేందుకు రంగం సిద్ధం చేశారు. క్వారీలన్నీ తమ చేతికి రాగానే అక్రమాలకు పాల్పడుతూ.. నిబంధనల ప్రకారం అంతా సక్రమంగానే ఉన్నట్లు చూపడానికి ఈ ఎత్తు వేశారు. మైనింగ్‌ మాఫియాకు ఎదురు చెప్పలేక మిల్లర్లు, క్వారీల లీజుదారులు మౌనంగా ఉండిపోతున్నారు. 

ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అధికారులు.. 
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అక్రమ క్వారీలను నిలిపివేయాల్సిన అధికారులు ఈ ప్రాంతంలోని అన్ని క్వారీలను నిలిపివేశారు. క్వారీ లీజుదారులపై కేసులు నమోదు చేయడం దగ్గర్నుంచి మిల్లర్లకు నోటీసులు జారీ చేయడం వరకు అన్ని అధికారపార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో చకచకా చేసేశారు. వారికి నోటీసులు ఇవ్వడంతోపాటు, కేసుల్లో ఇరికించడం వల్ల తాము చెప్పినట్లు వింటారనేది వారి ఆలోచన. అనుకున్న విధంగానే మిల్లర్లకు ట్రాన్సిట్‌ పాస్‌లు నిలిపివేయించారు. వారు బంద్‌కు దిగగానే తిరిగి వాటిని అధికారులతో ఇప్పించి మిల్లర్లు, క్వారీ లీజుదారులను తాము చెప్పినట్లుగా వినేలాచేశారు. కేసుల భయంతో మిల్లర్లు, క్వారీ లీజుదారులు కూడా ఇష్టంలేకపోయినా మైనింగ్‌ మాఫియా ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. 

క్వారీలన్నీ లాగేసుకునేందుకు పథకం 
క్వారీ లీజుదారులకు అనుమతులిచ్చేందుకు నిబంధనలు సాకుగా చూపుతూ వారిని భయాందోళనకు గురిచేసి తమ భూములు మాఫియాకు అమ్ముకునేలా అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాచేపల్లి మండలంలోని తంగెడ, పిడుగురాళ్లలో అక్రమక్వారీకి పక్కనే ఉన్న మరో క్వారీని అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కొనుగోలు చేసి తవ్వకాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనుమతులు ఉన్న క్వారీలను సైతం మూడు నెలలుగా నిలిపివేయించి తెల్లరాయి కొరత సృష్టించడం ద్వారా మిల్లర్లను, సున్నపురాయి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు. మైనింగ్‌ మాఫియా తప్ప, మరెవరూ క్వారీలను నడపలేరనే పరిస్థితికి అక్కడి వారిని తీసుకు వస్తున్నారు. అనుమతులు ఇప్పించాక తెల్లరాయిని ఎంతకు కొనాలో కూడా మాఫియా ఆదివారం రాత్రి సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ట్రక్కు తెల్లరాయి రూ.1500 ఉండగా, దాన్ని రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. తాము చెప్పిన ధరకు కొనుగోలు చేస్తే ఎవ్వరికీ ఇబ్బందులు ఉండవని, లేని పక్షంలో ఈ సంక్షోభం ఇలానే కొనసాగుతుందంటూ మిల్లర్లను భయపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. 

నిబంధనలు వీరికి వర్తించవు..
అనుమతులున్న క్వారీలను నిర్వహించేందుకు సైతం నిబంధనలను సాకుగా చూపి అనుమతించని మైనింగ్‌ అధికారులు.. ఈ భూములను అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కొనుగోలు చేయగానే అవన్నీ మరిచిపోనున్నారు. వారికి అనుమతులు మంజూరు చేసేందుకు వేగంగా ఫైళ్లు కదులుతున్నాయని తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో భారీ దోపిడీకి అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దందాలో అటు మిల్లర్లు, ఇటు సున్నపురాయి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top