ఎంఐఎంకు ‘గుర్తు’ తిప్పలు | MIM party struggles to get Party Symbols for upcoming elections | Sakshi
Sakshi News home page

ఎంఐఎంకు ‘గుర్తు’ తిప్పలు

Mar 9 2014 4:30 AM | Updated on Aug 14 2018 4:32 PM

ఎంఐఎంకు ‘గుర్తు’ తిప్పలు - Sakshi

ఎంఐఎంకు ‘గుర్తు’ తిప్పలు

ఎంఐఎం పార్టీకి ప్రతిసారి ఎన్నికల్లో ‘ఎవ్వరికీ కేటాయించని’ చిహ్నాల్లో (ఫ్రీ సింబల్స్) పతంగిని ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే

సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి ప్రతిసారి ఎన్నికల్లో ‘ఎవ్వరికీ కేటాయించని’ చిహ్నాల్లో (ఫ్రీ సింబల్స్) పతంగిని ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎంఐఎం.. చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడంలో జాప్యం చేసింది. దీంతో పతంగి కోసం దరఖాస్తు చేసుకున్న సమైక్యాంధ్ర పరిరక్షణ సమితికి ఆ చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ కేటాయించింది.
 
 రాష్ట్రంలోని 294 అసెంబ్లీ, 42 లోక్ స్థానాలకు పతంగి గుర్తును సమితి పొందింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇప్పుడు ఏమి చేయాలనే విషయంపై ఎన్నికల కమిషన్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం లేదా అసెంబ్లీ స్థానాల్లో మూడు శాతం సీట్లను గెలిచి ఉంటేనే, ఒకసారి కేటాయించిన చిహ్నాన్ని శాశ్వతంగా ఆ పార్టీకే ఉంచుతారు. 3 శాతం సీట్లు అంటే 9 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఎంఐఎం 7 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచినందున శాశ్వత చిహ్నం కేటాయింపునకు అవకాశం లేదు.
 
 మోడీ వస్తే అరాచకమే: ఒవైసీ
     గుజరాత్‌ను అభివృద్ధి చేశానంటూ నరేంద్ర మోడీ ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ అక్కడ జరిగింది అరాచక పాలనేనని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మోడీ ప్రధాని అయితే భారత్‌లో జరిగేది కూడా అరాచకపాలనేనని విమర్శించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్‌లో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా అడిగే పరిస్థితి లేదన్నారు. ఇళ్లు అమ్మాలన్నా, కొనాలన్నా ఆ ప్రభుత్వానికి తెలియపరచాలని, నచ్చిన మతాన్ని స్వీకరించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే షరతులు విధించారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement