
సాక్షి, అనంతపురం : కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న అనంత వాసులు బుధవారం గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో దాదాపు 1,100 వలస కార్మికులు స్వరాష్ట్రానికి చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపగా.. రైల్వే శాఖ ముంబై నుంచి గుంతకల్లుకు 24 బోగీల ప్రత్యేక రైలుకు నడిపింది. మంగళవారం రాత్రి ముంబై నుంచి బయలుదేరిన ఈ రైలు నేడు గుంతకల్లుకు చేరింది.
వీరిలో అత్యధికంగా ఉరవకొండ ప్రాంత కార్మికులు ఉన్నారు. వలస కార్మికులకు రైలు టిక్కెట్ చార్జీలు, భోజనం, టిఫిన్, మంచినీరు ఇతర ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేసింది. గుంతకల్లు చేరుకున్న కార్మికులకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించిన అధికారులు.. ప్రత్యేక బస్సుల్లో వారిని సంబంధిత క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అలాగే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ముంబైలో చిక్కుకుపోయిన తమను ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వలస కార్మికులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.