అవే ఆకలి కేకలు

Midday meal Scheme Delayedin West Godavari - Sakshi

మూడో రోజూ కడుపు మాడిన చిన్నారులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతోంది. ఈ పథకాన్ని ఏక్తాశక్తి సంస్థకు కట్టబెట్టిన ప్రభుత్వం భోజన సరఫరా నిర్వహణను గాలికివదిలేసింది. భోజనం అందక రెండురోజులుగా విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. ప్రారంభం రోజున విద్యార్థుల కడుపు మాడ్చిన ఆ సంస్థ మూడో రోజు కూడా కొనసాగించింది. సమస్యలను పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్థులు సమయానికి భోజనం అందక, అందినా చాలీచాలకుండా తింటూ అర్ధాకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఏలూరు క్లస్టర్‌కు సంబంధించి 214 పాఠశాలల్లోమొత్తం 20,434 మందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేయాల్సి ఉండగా 10 వేల మందికి మాత్రమే సరఫరా చేయగలుగుతోంది.

స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో 170 మంది విద్యార్థులుండగా శుక్రవారం కేవలం 30 మందికి సరిపడా వంటకాలను మాత్రమే సరఫరా చేయడంతో మిగిలిన వారికి ఏం చేయాలో పాలుపోక ఉపాధ్యాయులు తలపట్టుకు కూర్చున్నారు. ఇక యర్నగూడం క్లస్టర్‌ పరిధిలో సాంకేతిక లోపం అంటూ భోజనాలే సరఫరా చేయడం లేదు. ఉండి క్లస్టర్‌ పరిధిలో ఆకివీడు మండలంలో 55 పాఠశాలకు 30 పాఠశాలలకు, కాళ్ల మండలంలో 68 పాఠశాలలకు 50 స్కూళ్లకు, పాలకోడేరు మండలంలో 36  పాఠశాలలకు భోజనం సరఫరా చేయకపోవడంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మాత్రం భోజనాలు సకాలంలోనే అందచేస్తున్నారని ఒక ప్రకటనలో సమర్థించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top