కార్పొరేట్‌కు కంచాలు..

Midday Meal Scheme Delayed in Government Schools - Sakshi

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మొండిచెయ్యి

ప్రయివేటు ఏజెన్సీలకు పథకం అప్పగింత

నెల్లిమర్ల క్లస్టర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం నేడు

పొట్టగొడుతున్నారని నిర్వాహకుల గగ్గోలు

విజయనగరం, నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న నిర్వాహకుల పొట్టగొట్టేందుకు రంగం సిద్ధమైంది. పెద్దగా లాభం లేకపోయినా పదిహేనేళ్లుగా చిన్నారుల కడుపు నింపుతున్న నిర్వాహకుల్ని కాదని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వ సన్నాహాలు పూర్తయ్యాయి. తమ పొట్ట కొట్టొద్దని విన్నవిస్తూ ఎన్ని ఉద్యమాలు చేసినా.. వద్దంటూ నిర్వాహకులను వీధిన పడేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు జిల్లాలో తొలిసారిగా నెల్లిమర్ల క్లస్టర్‌ పరిధిలోని నెల్లిమర్ల, డెంకాడ, విజయనగరం మండలాల్లో వచ్చేనెల 1నుంచి పథకం నిర్వహణకు సంబంధిత ఏజెన్సీ రంగం సిద్ధం చేసుకుంది. నెల్లిమర్ల మండలంలో మంగళవారం ప్రయోగాత్మకంగా పాఠశాలలకు మధ్యా హ్న భోజనం సరఫరా చేయనుంది. దీంతో వేలా దిమంది నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.

2003 నుంచి పథకం ప్రారంభం
జిల్లావ్యాప్తంగా మొత్తం 2737 ప్రభుత్వ పాఠశాలల్లో 2003 నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. మొత్తం 71,611 మంది పాఠశాల విద్యార్థులు పథకం ద్వారా రోజూ భోజనం చేస్తున్నారు. తాజాగా పెరిగిన మెస్‌ చార్జీల ప్రకారం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రోజుకు రూ 4.13 పైసలు, యూపీ, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ 6.18 పైసలు ప్రభుత్వం చెల్లిస్తోంది. మొదట్నుంచీ ఈ పథకాన్ని ఆయా గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తున్నాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిర్వహణను ఆపలేదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా అప్పులు చేసి మరీ పిల్లలకు భోజనం వండిపెట్టారు.

కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం
నిర్వాహకులను తప్పించి కార్పొరేట్‌ ఏజెన్సీలకు పథకం నిర్వహణను అప్పగించింది. నవ ప్రయాస్‌తో పాటు అక్షయపాత్ర, అనే సంస్థలకు ధారాదత్తం చేసింది. ఈ సంస్థలు జిల్లాలోని పాఠశాలల ను 20 చొప్పున ఒక యూనిట్‌గా చేసుకుని భోజ నాన్ని సరఫరా చేయనున్నారు. మెనూ ప్రకా రం ఆహార పదార్థాలన్నీ ఒకచోట తయారుచేసి, వాహనాల్లో ఆయా పాఠశాలలకు పంపించనున్నారు.

నేడు ప్రయోగాత్మకంగా ప్రారంభం
జిల్లాలోనే తొలిసారిగా నెల్లిమర్ల క్లస్టర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు నెల్లిమర్ల రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి సమీపంలో వండి నెల్లిమర్ల, డెంకాడ, విజయనగరం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న నవ ప్రయాస్‌ సంస్థ ఇప్పటికే అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంది.

పొట్టగొట్టే ప్రయత్నం
పదిహేనేళ్లుగా మేము నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి, ప్రభుత్వం మా పొట్ట గొడుతోంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి పిల్లలకు భోజనం అందించాం. ఇప్పుడేమో సంస్థలకు అప్పగించి మాకు అన్యాయం చేసింది.పైల భారతి, ఎండీఎం నిర్వాహకురాలు.

మాకు దారి చూపాలి
2003 పథకం ప్రారంభం నుంచి మేం పిల్లలకు వండి పెడుతున్నాం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని భోజనం పెట్టాం. ఇప్పుడు మమ్మల్ని కాదని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడం భావ్యం కాదు. మాకు దారి చూపించి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. పాండ్రంకి మహాలక్ష్మి, అధ్యక్షురాలు, ఎండీఎం యూనియన్, నెల్లిమర్ల.

డిసెంబర్‌ 1నుంచి ప్రారంభం
నెల్లిమర్ల పట్టణం, మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను నవ ప్రయాస్‌ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. డిసెం బర్‌ ఒకటో తేదీనుంచి పాఠశాలలకు భోజనం సరఫరా చేయనున్నట్టు ఆ సంస్థ సమాచారం అందించింది. ప్రయోగాత్మకంగా మంగళవారం మండలంలో ప్రారంభించనున్నారు.  – అంబళ్ల కృష్ణారావు, ఎంఈఓ, నెల్లిమర్ల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top