ఏపీలో పెట్టుబడులకు జపాన్ దిగ్గజం ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’

Mekapati Goutham Reddy Meets Softbank In Business Outreach At Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో బిజినెస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో కీలక చర్చలు

ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో పెట్టుబడులు పెడతామన్న ప్రతినిధులు

15 రోజుల్లో మరోసారి భేటీ అనంతరం ఒప్పందంపై స్పష్టతకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ వాహన రంగంలో భారీ పెట్టుబడలు పెట్టేందుకు జపాన్ దిగ్గజ సంస్థ ‘సాఫ్ట్ బ్యాంక్’ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో ‘సాఫ్ట్ బ్యాంక్’ చర్చించింది. సోమవారం హైదరాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహంలో జరిగిన ‘బిజినెస్ ఔట్ రీచ్’ కార్యక్రమంలో సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం మంత్రితో భేటీ అయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమం, పరిశ్రమల వృద్ధిని సమాన స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వెళుతున్నారని ప్రతినిధులకు తెలిపారు. ఎన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టినా.. రాష్ట్రంలో అనుకూలం వాతావరణం ఉంటుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా కొత్త సంవత్సరం కల్లా పరిశ్రమలకు అనుకూలమైన, పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని వివరించారు.

యువతకు ఉపాధి, మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు.. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు వంటి అంశాలను మంత్రి ఈ సందర్భంగా ప్రతినిధులకు వివరించారు.

ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా.. గొప్ప నిర్ణయాలని కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగేందుకు ఆసక్తిగా ఉన్నామని సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం పేర్కొంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. రెండు వారాల్లో స్పష్టమైన ప్రణాళికతో మరోసారి భేటీ అయి పూర్తి వివరాలు అందించాలని ప్రతినిధి బృందాన్ని మంత్రి కోరారు. సాఫ్ట్ బ్యాంక్ ప్రతిపాదనలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని గౌతమ్‌రెడ్డి... ప్రతినిధులకు తెలిపారు. అందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది.

వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు
బిజినెస్ ఔట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివిధ సంస్థలతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసీసీఐ) ప్రతినిధుల బృందం మంత్రితో భేటీ అయ్యారు. ఈటీఏ అలెక్ట్రా ఎలక్ట్రానిక్ వెహికిల్స్ సీఈవో బిజు థామస్, విష్ణు గ్రూప్ వైస్ ఛైర్మన్ రవి చంద్రన్ , డెలాయిట్ ప్రతినిధి కౌశల్, జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్, అహ్మదాబాద్‌కు చెందిన ఐఐఎమ్ ప్రతినిధి, ఏపీ బ్రాండింగ్ ప్రమోషన్‌పై పీఆర్ ఏజెన్సీలతో మంత్రి సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని ఐటీ, పరిశ్రమ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతికత అభివృద్ధి వంటి అంశాలపై మంత్రి గౌతమ్‌రెడ్డి ఆయా కంపెనీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top